Jun 09,2023 23:26

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రమాద సమయంలో పేద ప్రజలకు అండగా నిలుస్తున్న వైయస్సార్‌ బీమా నమోదు కార్యక్రమం కాకినాడ జిల్లాలో నర్తనడకన సాగుతోంది. ఈ నెల 10వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు 64 శాతమే పూర్తయింది. సాంకేతిక సమస్యలకు తోడు నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేపట్టకపోవడంతోనే లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని సిబ్బందిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
దారిద్రరేఖకు దిగువన ఉన్న వారందరూ వైయస్సార్‌ బీమా నమోదుకు అర్హులను ప్రభుత్వం చెబుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ దీని నమోదుకు గడువు ఇచ్చారు. అయితే సర్వర్‌ సమస్యల వల్ల రెండు మూడు రోజులు సక్రమంగా పని చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శి, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి నమోదు చేపట్టాల్సి ఉంది. కొన్ని సమయాల్లో ఇంటి యజమాని అందుబాటులో ఉండడం లేదు. దీంతో నమోదు నత్తనడకన సాగుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బీమా అమలు నిబంధనల్లో మార్పు చేయడంతో ఈ సమస్య ఎదురవుతోంది. గతంలో ఇంటిలో ఎవరికి ప్రమాదం జరిగినా, మరణించినా బీమా వర్తించేది. కానీ ఇప్పుడు ఇంటి యాజమానికి మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 18-70 ఏళ్లలోపు వారు సహజ మరణం పొందితే రూ.లక్ష, ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేస్తారు. 51-70 ఏళ్ల లోపు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.3 లక్షలు చొప్పున అందిస్తారు. ప్రమాదంలో పాక్షిక వైకల్యం పొందిన వారికి రూ.2.50 లక్షలు అందజేస్తారు.
గడువు ముగుస్తున్నా చేరని లక్ష్యం
నేటితో బీమా నమోదుకు గడువు ముగుస్తున్నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. కాకినాడ జిల్లాలో 5,83,413 మందిని అర్హులుగా గుర్తించారు. గతంలో నమోదైన 5,43,146 మందివి రెన్యువల్‌ చేయాల్సి ఉంది. శుక్రవారం వరకూ 3,72, 985 మందివి అంటే 64 శాతం మాత్రమే రెన్యువల్‌ పూర్తి అయింది. 4,0267 మందిని కొత్తగా నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4446 మందివి మాత్రమే పూర్తి చేసారు. కాకినాడ నగరంలో 76,659 మంది వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఇంత వరకు 60 శాతం అంటే 59,466 మందివి నమోదు చేసారు. జగ్గంపేటలో 24,222 మందికి 12,752, యు.కొత్తపల్లిలో 24,624 మందికి 17,972, సామర్లకోట టౌన్‌లో 14,881 మందికి 10,914, తుని అర్బన్‌లో 12,680 మందికి 9,348, కోటనందురులో 14,271 మందికి గానూ 10,894 మందికి బీమా నమోదు కావాల్సి ఉంది. నమోదు ప్రక్రియలో భాగంగా ఇంటి యజమాని ఆధార్‌ నంబరు ఎంటర్‌ చేయగానే లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు ఒటిపి వస్తుంది. చాలామంది అందుబాటులో లేకపోవడంతో నమోదుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది మొబైల్‌ నెంబర్‌ మార్చడంతో ఒటిపి రావడం లేదు. దీంతో మళ్లీ ఇకెవైసి చేయించుకోవాల్సి ఉంటుంది. పగటి వేళల్లో సర్వర్‌ పని చేయడం లేదని సిబ్బంది తెలుపుతున్నారు.