పులివెందుల వాటర్‌గ్రిడ్ పథకం నత్తనడకన సాగుతోంది. 2021 మే 21న రూ.460 కోట్ల కాంట్రాక్టును మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ ఏడాది మే నాటికి పనులు పూర్తి చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ఆమేరకు గడువు ముగిసే నాటికి 40 శాతం పనులు పూర్తి చేయలేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదిలాఉండగా తాజాగా డిఐ పైప్‌లైన్ ఏర్పాటులో మీనమేషాలు లెక్కిస్తోంది. పైప్‌లైన్‌పై ఆధారపడి ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు పనిచేయాల్సి ఉంటుంది. 24 నెలల్లో 40 శాతం పనులు చేపట్టిన ఆధారంగా పనితీరును అంచనా వేస్తే మరో రెండేళ్లు గడిచినప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవనే విషయంద్యోత కమవుతోంది.
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : పులివెందుల వాటర్‌గ్రిడ్ సా..గుతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1125 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ల ద్వారా 2,20,631 మందికి శుద్ధి జలాన్ని సరఫరా చేయాలి. రోజుకు 0.83 టిఎంసిల నీటిని పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, చక్రాయపేట, వేంపల్లి, వేముల మండలాల పరిధిలోని 299 హ్యాబిటేషన్లకు సరఫరా చేయాల్సి ఉంది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ 2021 మే 21న ఒప్పందం కుదుర్చుకుంది. 24 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈలెక్కన 2023 మే 21 తేదీ నుంచి 2,20,631 నుంచి 2051 నాటికి 5,36,821 మందికి 100 ఎల్‌పిసిడి ప్రకారం తాగునీటిని సరఫరా చేయాలి.
40 శాతం దాటని పనులు
పులివెందుల వాటర్‌గ్రిడ్ పథకం కాంట్రాక్టు గడువు ముగిసి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ 40 శాతం పనులు పూర్తి చేయక పోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2024 మే 21 నాటికి కాంట్రాక్టు గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దశల వారీగా రూ.120 కోట్ల చెల్లింపులు చేసినట్లు సమాచారం. తాజాగా మరో రూ.తొమ్మిది కోట్ల చెల్లింపులకు బిల్లులు పెట్టడం గమనార్హం. పనులు జరిగిన తీరును పరిశీలిస్తే మరో రెండేళ్లు గడువు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
పైప్‌లైన్ ఏర్పాటులో మీనమేషాలు
డిఐ పైప్‌లైన్ ఏర్పాటు చేయడంలో కాంట్రాక్టు సంస్థ మీనమేషాలు లెక్కిస్తోంది. టెండర్ కండిషన్ నిబంధనల మేరకు 288 కిలోమీటర్ల మేరకు డిఐ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు నిర్మించాల్సిన డిఐ పైప్‌లైన్ మార్కెట్‌లో రెట్టింపు ధర పలుకుతున్న నేపథ్యంలో జంకుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంట్రాక్టు సంస్థను వెంటపడుతున్నప్పటికీ ఆశించిన స్పందన లేదనే వాదన వినిపిస్తోంది. డిఐ పైప్‌లైన్ ఏర్పాటుపై ఆధారపడి 1125 కిలో మీటర్ల హెచ్‌డిఎఫ్‌సి పైప్‌లైన్ల పనితీరు ఆధారపడి ఉంటుంది.
స్ట్రక్షర్ల నిర్మాణాలూ అంతే!
పులివెందుల వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల్లో నాలుగు రకాల స్ట్రక్షర్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో జిఎల్‌ఆర్‌బిస్, ఒహెచ్ ఆర్‌బిఎస్, సంపులు, ఒహెచ్‌ఆర్‌ఎస్, జిఎల్‌ఎస్‌ఆర్‌ఎస్ అనే స్ట్రక్షర్లు కీలకమైనవి. ఇందులో 10 జిఎల్‌బి ఆర్‌ఎస్ స్ట్రక్షర్లకుగానూ ఆరింటిని పూర్తి చేయగా, మూడు ప్రోగ్రెస్ బాటలోనూ, ఒకటి గ్రౌండింగ్ దశలో ఉంది. ఆరు ఒహెచ్ బిఆర్‌ఎస్‌ల్లో ఐదింటిని పూర్తి చేసింది. ఒకటి ప్రోగ్రెస్‌లో ఉంది. వీటితోపాటు 11 సంపు నిర్మాణా లకుగానూ ఐదింటిని పూర్తి చేసింది. ఏడు ప్రోగ్రెస్‌లో ఒకటి గ్రౌండింగ్ దశలో కొనసాగుతోంది. తొమ్మిది జిఎల్‌ఎస్‌ఆర్ స్ట్రక్షర్లలో ఒకటి పూర్తి చేయగా, మరొకటి పూర్తి కాగా, ఏడు గ్రౌండింగ్ దశలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇందులో 260 కిలోమీటర్ల మేర డిఐ పైప్‌లైన్ నిర్మాణ పనులు, 642 హెచ్‌డిఎఫ్‌సి పైప్‌లైన్ నిర్మాణ పనులు పెండింగ్ బారిన పడిన నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది.
ఏడాది వ్యవధిలో పూర్తి
పులివెందుల వాటర్‌గ్రిడ్ పనుల్ని ఏడాది వ్యవధిలో పూర్తి చేయడంపై దృష్టి సారించాం. ఎస్‌ఇ మొదలుకుని కలెక్టర్ నుంచి సిఎంఒ కార్యాలయం వరకు మానిటరింగ్ చేయడం జరుగుతోందని, ఏడాది వ్యవధిలోపు పనులు పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తున్నాం.
- వీరన్న, ఆర్‌డబ్య్లుఎస్, ఎస్‌ఇ, కడప.










