Oct 31,2022 23:35

ఓటర్ల నమోదును పరిశీలిస్తున్న ఆర్‌డిఒ భాస్కరరెడ్డి

ఆఫ్‌లైన్‌లో1390, ఆన్‌లైన్‌లో 6,895 దరఖాస్తులు
ప్రజాశక్తి -భీమునిపట్నం
: భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఐదుమండలాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు నత్తనడకన సాగుతోంది. రానున్న మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ అక్టోబర్‌ ఒకటి నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల ఏడోతేదీ వరకు అంటే మరో వారం రోజుల్లో ఓటర్ల నమోదుకు దరఖాస్తు గడువు ముగుస్తున్నప్పటికీ, అర్హులైన పట్టభద్రుల నుంచి ఫారం-18 దరఖాస్తుల సమర్పణ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే చెప్పాలి.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు విషయాన్ని పరిశీలిస్తే అటు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ చాలా మందకొడిగా సాగుతుందనే చెప్పాలి.
ఆఫ్‌లైన్‌లో కేవలం 1390 దరఖాస్తులే...
భీమిలి నియోజకవర్గంలో ఆఫ్‌లైన్‌లో అందిన పట్టభద్రుల ఓటర్ల నమోదు, ఫారం-18 దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే ఇప్పటివరకు కేవలం 1390 దరఖాస్తులే వచ్చాయి. అందులో భీమిలి మండలంలో 225 మంది, ఆనందపురంలో 75 మంది, పద్మనాభంలో 97 మంది, విశాఖ రూరల్‌(చిన గదిలి మండలం)లో 222 మంది, సీతమ్మధారలో 771 మంది ఓటర్లుగా నమోదుకు పట్టభద్రులు దరఖాస్తులు అందజేశారు.
ఆన్‌లైన్‌లో కొంతనయం...
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆన్‌లైన్‌లో నమోదైన పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే, ..భీమిలి మండలంలో 800 మంది, ఆనందపురంలో 320 మంది, పద్మనాభంలో 225 మంది, విశాఖ రూరల్‌ ( చినగదిలి మండలం) లో 2,920 మంది, సీతమ్మధారలో 2,630 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
స్పెషల్‌ డ్రైవ్‌లో..
పట్టభద్రుల ఓటర్ల నమోదుకు సంబందించి అక్టోబర్‌ 30న తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేయగా, ఆఫ్‌లైన్‌ ద్వారా 639 మంది దరఖాస్తులు అందజేశారు. భీమిలి మండలంలో 58 మంది, ఆనందపురంలో 30 మంది, పద్మనాభంలో 13 మంది, విశాఖ రూరల్‌ (చిన గదిలి) లో 37 మంది, సీతమ్మధారలో 501 మంది దరఖాస్తులు అందజేశారు. ఓటర్ల నమోదుకు మరో వారం రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటర్లు నమోదుపై ప్రత్యేక దృష్టిసారిస్తే గానీ ఫలితం లేదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన
పట్టభద్రుల ఓటర్ల నమోదుకు సంబందించి అభ్యర్ధుల నుంచి అందిన ఫారం -18 దరఖాస్తుల్లో పొందుపరిచిన మొబైల్‌ నంబర్‌ ఆధారంగా సంబంధిత విఆర్‌ఒలు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. దరఖాస్తులో పేర్కొన్న నివాసం ఉంటున్నదీ లేనిదీ, అలాగే, ఎన్నికల సంఘం నిర్ధేశించిన గడువులోగా గ్రాడ్యుయేట్‌గా ఉత్తీర్ణుడైనదీ లేనిదీ, తదితర అంశాలను ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఆధారంగా పరిశీలన జరిపి, ధ్రువీకరించుకుంటారు.
కె శ్రీనివాసరావు,ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌
భీమునిపట్నం