నాడు-నేడు ద్వారా పనులు చేపట్టి పాఠశాలల రూపు రేఖలు మార్చుతున్నట్లు ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేస్తోంది. అయితే పలుచోట్ల చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఈ పాఠశాలల రూపురేఖలు అధ్వానంగా ఉన్నాయన్నది గిరిజనుల మాట. కాంట్రాక్ట్ విధానానికి చరమగీతం పాడి స్కూల్ కమిటీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినప్పటికీ పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో విద్యా కమిటీలకు అందకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల నాడు నేడు పనుల పరిస్థితి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా తయారైందన్న అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్ష్యాతూ డిప్యూటీ సిఎం ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రజాశక్తి - మక్కువ
మండలంలోని మార్కొండపుట్టి పంచాయతీ పరిధిలోని కె.పెద్దవలస ప్రాథమిక పాఠశాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేసే ఈ పాఠశాలకు నాడు-నేడు నిధులు మంజూరు కావడంతో పాత భవనాన్ని తొలగించారు. సుమారు 52 మంది విద్యార్థులకు స్థానికులు ఏర్పాటు చేసే షెడ్డులోనే విద్యను అందజేస్తున్నారు. నాడు - నేడు పనుల కింద భవన నిర్మాణానికి సుమారు రూ.37లక్షలు మంజూరయ్యాయి. తొలిత విడుదలైన నిధులు వెనక్కి వెళ్లిపోగా మళ్లీ ఈ ఏడాది మార్చిలో రూ.లక్షా78వేలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో సుమారు రూ.లక్షా76వేలు ఖర్చు చేసి భవన నిర్మాణానికి అవసరమైన ఇనుము, రాయి, ఇసుక వంటి ముడి సరుకులు తీసుకొచ్చారు. అలాగే ఫిల్లర్ల నిర్మాణానికి గోతులు కూడా తవ్వేశారు. అయితే చాలాకాలం అవుతున్నప్పటికీ నిర్మాణానికి సంబంధించిన మిగతా నిధులకు అనుమతులు రాకపోవడంతో గతంలో తెచ్చిన ముడి సరుకు అలాగే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాత్రి వేళల్లో ముడి సరుకులు దొంగలు పట్టుకుపోతున్నారు. ఇనుము తుప్పుపడుతోంది. ఫిల్లర్ల కోసం తీసిన గోతులు కూడా కప్పుబడిపోయాయని స్థానికులు అంటున్నారు. భవన నిర్మాణ పనులు ఎప్పుడు చేపడతారో తెలియని దుస్థితి ఏర్పడింది. ఫిల్లర్ల కోసం తీసిన గోతులు వైపు పిల్లలు వెళ్తే ప్రమాదమని అడ్డంగా కంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి వెంటనే పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు
డిప్యూటీ సిఎం ఇలాకాలోనే..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మంత్రి పీడిక రాజన్న దొర స్వగ్రామం పక్కనే కె.పెద్దవలస. ఈ పాఠశాల సమస్యపై కూడా పలుమార్లు డిప్యూటీ సిఎం దృష్టి వివిధ సందర్భాల్లో గ్రామస్తులు, జనసేన కార్యకర్తలు తీసుకువెళ్లారు. అయినా ఇప్పటికీ ఈ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సిఎం రాజన్నదొర ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల నిర్మాణానికి కృషి చేయాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు