Mar 06,2023 23:20

నాడు-నేడుకు ఎంపికైన ఉగ్గంగొయ్యి ప్రాథమిక పాఠశాల

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.కోట్లు వెచ్చిస్తున్నామన్న ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలు గానే మిగిలి పోతున్నాయి. అట్టహాసంగా పనులు ప్రారంభించి అనంతరం నిధులు లేమితో నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. నాడు నేడు రెండో విడత పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల విడుదలలో కొనసాగుతున్న అంతులేని జాప్యమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో భాగంగా రెండో విడత కింద జిల్లాలోని 22 మండలాల పరిధిలో 945 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.212 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ.32 కోట్ల నిధులను పాఠశాలల ఖాతాలకు జమ చేశారు. ఆయా పనులు లక్ష్యం మేరకు ముందుకు సాగక పోవడంతో హెచ్‌ఎంలు, తల్లిదండ్రుల కమిటీలు, పర్యవేక్షణ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు అసంపూర్తి పనులతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఏ పని పూర్తి చేద్దామన్నా నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే ఇచ్చిన అరకొర నిధులతో ఎక్కువమంది ఇసుక, ఇటుక రాయి ఖరీదు చేశారు. నిధులు లేక ఎక్కడ పనులు అక్కడే నిలిచాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన మెటీరియల్‌ కూడా అరకొరగానే వస్తోంది. దీంతో అసంపూర్తి మరమ్మతులతో ఆయా విద్యాలయాలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.
పాడేరు మండలం ఉగ్గంగొయ్యి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి (మరమ్మతు) పనులకు మంజూరైన రూ.11 లక్షల 95 వేలకు గానూ తొలి విడతగా .1లక్షా 79వేలు ఇచ్చారు. ఆ నిధులతో బోరు తవ్వించి, మరుగుదొడ్లకు మరమ్మతులు, దివ్యాంగులకు ర్యాంపు నిర్మాణం పనులు చేపట్టారు. ఆయా పనులు పూర్తికాకుండా వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే మనబడి నాడు-నేడు పనులకు సకాలంలో నిధులను విడుదల చేయక పోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండలాల వారీగా నాడు నేడుకు
ఎంపికైన పాఠశాలలు:
జిల్లాలో 945 పాఠశాలలను రెండో విడత నాడు-నేడులో అభివృద్ధికి ఎంపిక చేశారు. వీటిలో పాడేరు మండలంలో 26, మాడుగులలో 65, చింతపల్లిలో 100, జీకే.వీధిలో 63, కొయ్యూరులో 26, ముంచంగిపుట్టలో 68, పెదబయలులో 83, హుకుంపేటలో 49, డుంబ్రిగుడలో 81, అరకులోయలో 61, అనంతగిరి మండలంలో 50 పాఠశాలలు ఉన్నాయి. రంపచోడవరం మండలంలో 39, దేవీపట్నంలో 17, వై.రామవరంలో 29, అడ్డతీగలలో 30, గంగవరంలో 15, మారేడుమిల్లిలో 8, రాజవొమ్మంగిలో 34, ఏటపాకలో 32, చింతూరులో 32, కూనవరంలో 17, వీఆర్‌ పురంమండలంలో 5 పాఠశాలలను ఎంపిక చేశారు.