Aug 10,2023 23:32

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పలు రోగాలకు మనం తాగే నీరే ప్రధాన కారణమవుతుండడంతో అనేకమంది ప్రజలు తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. కొంతమంది సురక్షిత నీటిని కొనుగోలు చేస్తుండగా మరికొందరు అందుబాటులో ఉన్న నీటిని వినియోగిస్తూ రోగాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చి సురక్షితమైన తాగునీటిని అందించే విధంగా 2020 అక్టోబర్‌ లో జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చింది. అయితే నిధుల కొరతతో ఈ కార్యక్రమం పనులు క్షేత్రస్థాయిలో మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.
అరకొర పనులే పూర్తి
జిల్లాలోని 667 ఆవాసాలకు 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని జల్‌ జీవన్‌ మిషన్‌ను అమలు చేస్తున్నారు. మొత్తం 3,89,205 ఇళ్లకు కుళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేయడానికి రూ.407.66 కోట్లకు ప్రణాళిక తయారు చేయగా ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందులో మొత్తం 874 పనులు మంజూరు కాగా మూడేళ్లలో ఇప్పటి వరకు రూ.97.85 కోట్ల విలువైన 385 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 153 పనులు పురోగతిలో ఉన్నాయి. 27 పనులు ప్రారంభమే కాలేదు. ఇందులో మొదటి విడతలో 565 ఆవాసాల్లో కుళాయిలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ వాటా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా 50 శాతంతో మొత్తం రూ.245.03 కోట్లకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో రూ.5 లక్షల లోపు ఉన్న 18 పనులకు రూ.54 లక్షలు మంజూరు కాగా 13 పనులు ప్రారంభించి పూర్తి చేసారు.రూ.5 లక్షల పైబడిన 410 పనులకు రూ.194.63 కోట్లు మంజూరు కాగా అన్ని పనులకు టెండర్ల ప్రక్రియను మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేయగలిగారు. వీటిలో ఇప్పటి వరకు 250 పనులు మాత్రమే పూర్తయ్యాయి.మరో 121 పనులు పురోగతిలో ఉండగా ఇంకా 39 పనులు మొదలు కావాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న తాగునీటి వనరుల పెంపుదల కేటగిరీలో భాగంగా రూ.49.86 కోట్ల విలువైన 137 పనులకు గాను 136 పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా 106 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 30 పనులు పురోగతిలో ఉన్నాయి.
టెండర్ల దశలోనే పనులు
రెండో విడతలో మిగిలిన 102 ఆవాసాల్లో 309 పనులు రూ.162.62 కోట్లు మంజూరు కాగా ఈ పనులు నేటికీ టెండర్ల దశలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 3,13,082 కుళాయి కనెక్షన్లు ఇవ్వగా ఇంకా 75,403 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన 35,838 కనెక్షన్లు పూర్తి చేసేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందనేది అధికారులకు కూడా స్పష్టత లేదు. బిల్లుల విడుదలలో జాప్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉదాహరణకు యు.కొత్తపల్లి మండలంలో రూ.6.43 కోట్ల విలువైన 14 పనులకు ఇప్పటివరకు గోరస, మూలపేట, కోనపాపపేట, ఇసుకపల్లి, పొన్నాడ, ఉప్పరగూడెంలో 7 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వీటికి రూ.2.39 కోట్లు బిల్లులు విడుదల కావాల్సి ఉంది.చేసిన పనులకు ఇప్పటి వరకూ జిల్లాలో ఎన్ని రూ.కోట్లు నిధులు పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.