ప్రజాశక్తి - కె.కోటపాడు
రాష్ట్రంలో గూడు లేని ప్రజలు ఏ ఒక్కరూ ఉండరాదన్న సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వాటిల్లో ఇళ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని తొలిత చెప్పిన ప్రభుత్వం, ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లడంతో చాలా మంది పేదల ఇళ్ల నిర్మాణం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2,877 మంది పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో కె.కోటపాడు మండలంలోని 32 పంచాయతీల్లో 28 లేఅవుట్లు ఏర్పాటు చేసి, 514 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు 13 ఇళ్లుపూర్తి కాగా, 80 ఇళ్లకు స్లాబ్ వేశారు. మేడిచర్ల, రొంగలినాయుడుపాలెం గ్రామాల్లోని లేఅవుట్లలో ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ లేఅవుట్లలో పూర్తిగా నీరు నిల్వ ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా లేదు.
ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం లక్షా 80వేల రూపాయిలు ఇవ్వగా, ఇందులో ప్రభుత్వం రూ.1.50 లక్షలు, ఉపాధి హామీ నిధులు నుంచి రూ.30 వేలు ఇస్తుంది. ఇంకా కావాల్సిన వారికి గృహ నిర్మాణ శాఖ అధికారుల సిఫార్సు మేరకు వెలుగు డిపార్టుమెంట్ నుంచి రూ.35 వేలు రుణం ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ధరలతో సంబంధం లేకుండా ఒక్కో బస్తా రూ.287 చొప్పున 90 బస్తాల సిమెంట్, ఉచితంగా 20 టన్నుల ఇసుకను ప్రభుత్వం అందజేయనుంది. ఈ ఏడాది డిసెంబరు 21 నాటికి జగనన్న కాలనీల్లో నూరు శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులు, వైసిపి ప్రజాప్రతినిధులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే నిర్మాణ మెటీరియల్ ధరలు, మేస్త్రీలు, కార్మికుల కూలి రేట్లు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్నది ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో జగనన్న కాలనీలో స్థలం పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేకపోతున్నారు. మరో వైపు మూడు నెలల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కూడా ఇళ్ల నిర్మాణానికి ఆటంకంగా మారాయి. అంతే కాకుండా ఇళ్లు నిర్మించుకునే వారికి సకాలంలో పేమెంట్లు చేయకపోవడం, ప్రభుత్వం ఇస్తున్న సిమెంటు, ఇసుక, ఇనుము సకాలంలో ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి కొంతమంది వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో ఇంతవరకు రూ.3,54,48,409 లబ్ధిదారులకు బిల్లులు అందజేసినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.










