Oct 24,2023 23:30

2020 డిసెంబర్‌ 25న సిఎం జగన్‌ ప్రారంభించిన యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణ పరిస్థితి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం నత్తనడకన సాగుతుంది. ప్రభుత్వం చెబుతున్న స్థాయిలో నిర్మాణాలు వేగవంతంగా జరగడం లేదు. ప్రభుత్వం అందించే సాయం అరకొరగానే ఉండడం, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు 27 శాతమే నిర్మాణాలు పూర్తి అయ్యాయి.
2020 డిసెంబర్‌ 25న ముఖ్యమంత్రి జగన్‌ యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే-అవుట్‌లో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటి సభలో జగన్‌ అందరికీ ఇళ్లు త్వరితగతిన కట్టి ఇస్తామని, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండున్నర ఏళ్లు దాటినా కాకినాడ జిల్లాలో 20,164 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. కొమరగిరి లే-అవుట్‌లో కాకినాడ అర్బన్‌ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు సుమారు 16 వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కనీసం 200 ఇళ్లు కూడా ఇక్కడ పూర్తి కాలేదు. నిర్మాణాలు వివిధ దశల్లోనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కల్పన నామమాత్రంగానే ఉన్నాయి.
కానరాని పురోగతి
జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన- వైఎస్‌ఆర్‌(అర్బన్‌) బిఎల్‌సి పథకం, పిఎం ఆవాస్‌ యోజన వైఎస్‌ఆర్‌(గ్రామీణ) పథకాల్లో రూ.1361.67 కోట్ల నిధులతో 75,648 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 20,253 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. 7,780 ఇళ్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 16,138 ఇళ్లు మంజూరు కాగా 10,971 ఇళ్లు ఇంకా బిలో బేస్మెంట్‌ స్థాయిలోనే ఉన్నాయి. 1,730 మాత్రమే పూర్తయ్యాయి. ఇక్కడ ఇంకా 422 స్థలాల్లో కనీసం పునాదులకూ నోచుకోలేదు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో 10,621 మంజూరు కాగా, 2,295 మాత్రమే పూర్తయ్యాయి. 4,681 ఇళ్ళకు పునాదులు కూడా నిర్మించలేదు. పెద్దాపురం నియోజకవర్గంలో 8,505 ఇళ్లు మంజూరవ్వగా 3,423 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 3,049 ఇళ్లు పునాదులు దాటలేదు. ఈనెల 12న ముఖ్యమంత్రి జగన్‌ సామూహిక గృహ ప్రవేశాలు కార్యక్రమం సామర్లకోటలో ఆర్బాటంగా నిర్వహించారు. సామర్లకోట ఇటిసి లే-అవుట్‌, ప్రత్తిపాడు రోడ్డు మార్గంలో ఉన్న లేఅవుట్‌లలో 2,802 మందికి పట్టాలివ్వగా 1,019 మాత్రమే ఇళ్ళు పూర్తయ్యాయి. ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించకపోవడంతో స్వయంగా సీఎం ప్రారంభించిన చోటే 50 శాతం ఇళ్ళు కూడా పూర్తి కాకపోవడం గమనార్మం. జగ్గంపేట నియోజకవర్గంలో 4,941 మంజూరు కాగా 2వేల గృహాలు పూర్తయినట్లు అధికారులు లెక్కల్లో చెబుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 7,929 ఇళ్లు మాజూరయ్యాయి. ఇక్కడ 3,510 మాత్రమే పూర్తి కాగా 2,585 ఇళ్లు పునాదులు దాటలేదు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 6,052 ఇళ్లకు 2,374 ఇళ్ళు పూర్తయ్యాయి. తుని నియోజకవర్గంలో 11,379 ఇళ్లకు కేవలం 2539 పూర్తి అయ్యాయి. వివిధ కారణాలతో అనేక నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటిలో నెలలు తరబడి వివిధ దశల్లో ఉన్నాయి.
భారీగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు
ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల వ్యత్యాసం లేకుండా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. అందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే కూలీల ఖర్చులు రూ.30 వేలు పోనూ లబ్ధిదారుల చేతికందేది రూ.1.50 లక్షలు మాత్రమే. ఇది ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోవడం లేదు. కనీసం పునాది నిర్మించడానికే రూ.3 లక్షలు పైనే ఖర్చు అవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇటుక, ఇనుము, మేస్త్రీలు, కూలీల ఖర్చులతో పాటు, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం ఇళ్ల నిర్మాణాలపై పడింది. ఒక ఇంటిని సాధారణంగా నిర్మించుకోవాలంటే కనీసం రూ.7 నుంచి రూ.8 లక్షలు ఖర్చు చేయాల్సిందే. దీంతో లబ్ధిదారులు అప్పులు చేసి కొంతమంది కట్టుకుంటున్నా అనేకమంది పేదలు నిర్మాణాలను మొదలుపెట్టి వదిలేసారు. ప్రభుత్వం అందించే సాయం అరకొరగానే ఉండడంతో ఇబ్బందులు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్‌ఆర్‌ (అర్బన్‌) బిఎల్‌సి పథకంలో...
మంజూరైన మొత్తం ఇళ్లు : 72,041
మొదలు పెట్టిన ఇళ్లు : 67,779
బిలో బేస్మెంట్‌ లెవెల్‌ : 31,899
బేస్‌మెంట్‌ లెవెల్‌ : 11,930
రూప్‌ లెవెల్‌ : 1,950
స్లాబ్‌ లెవెల్‌ : 1,836
పూర్తయిన ఇళ్లు : 20,164
మొదలు పెట్టనివి : 4,262
ఖర్చు (రూ. లక్షల్లో) : 52,615
వైఎస్‌ఆర్‌ (రూరల్‌) బిఎల్‌సి పథకంలో...
మంజూరైన మొత్తం ఇళ్లు : 3,607
మొదలు పెట్టిన ఇళ్లు : 2,414
బిలో బేస్‌మెంట్‌ లెవెల్‌ : 1,539
బేస్‌మెంట్‌ లెవెల్‌ : 299
రూప్‌ లెవెల్‌ : 200
స్లాబ్‌ లెవెల్‌ : 287
పూర్తయిన ఇళ్లు : 89
మొదలు పెట్టనివి : 1,193
ఖర్చు (రూ. లక్షల్లో) : 856.40