Oct 21,2023 21:51

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి అసంఘటిత రంగ కార్మికుల భద్రత, సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ-శ్రమ్‌ లక్ష్యం జిల్లాలో నెరవేరడం లేదు. కార్మికులకు అవగాహన కల్పించకపోవడం, ప్రభుత్వం ప్రచారం నామమాత్రంగా నిర్వహించడం, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల నిర్వాహకులు అక్రమంగా డబ్బులు వసూళ్లు చేయడం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు కనీసం లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 5,44,810 మంది అసంఘటిత రంగ కార్మికులున్నారని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 58 శాతం మంది మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నారు. గ్రామం యూనిట్‌గా కార్మికులను గుర్తించి నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశాలున్నాయి.
ఈ శ్రమ్‌ పథకం ప్రయోజనాలు
.ఈ-శ్రమ్‌లో చేరిన ప్రతీ అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక యూనివర్సల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరుతో (యూఎఎన్‌)గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతీ కార్మికుడికి ఒక సంవత్సరంపాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) కింద రూ.2 లక్షల ప్రమాద మరణ, అంగవైకల్య బీమా ఉచితంగా కల్పిస్తారు. ప్రభుత్వం అ సంఘటిత రంగ కార్మికుల కోసం చేసే పథకాలు, విధానాలకు ఈ డేటా బేస్‌నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారిక ఉపాధి కల్పించడం లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. కార్మికుల సామాజిక భద్రత కోసం అందించే ఆర్థిక సాయం కార్మికులకు లేదా నామినీ ఖాతాకు నేరుగా జమ చేస్తారు. దీంతోపాటు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌దన్‌లో కార్మికులు చేరే అవకాశం ఉంది.
అసంఘటిత రంగ కార్మికులంతా అర్హులే
ఈ శ్రమ్‌ పథకంలో చేరేందుకు అసంఘటిత కార్మికులందరూ అర్హులే. వ్యవసాయ రంగ కూలీలు, ఆశా వర్కర్లు, వలస కార్మికులు, కొరియర్‌ బార్సు, తోపుడు బండి వర్తకులు, మత్స్య కార్మికులు, పాల వ్యాపారులు, చేతివృత్తి వారు, భవన, ఇతర కార్మికులు, ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ సభ్యత్వం లేని వారంత అర్హులు. చేనేత కార్మికులు, వండ్రంగులు, ఇటుక బట్టి, క్వారీ కార్మికులు, మిల్లు కార్మికులు, వార్తా పత్రిక విక్రేతలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికుడు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, పశు సంవర్థక కార్మికులు, బీడీ రోలింగ్‌ కార్మికులు, క్షురకులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, చిన్న, సన్న కారు రైతులు, పాడి పరిశ్రమ, రాడ్‌ బెండింగ్‌, ప్లంబింగ్‌, టైల్స్‌, ఎలక్ట్రిషన్‌, వెల్డింగ్‌, ఇటుక, వ్యవసాయ రంగంలోని కార్మికులు, చేనేత, బీడీ కార్మికులు, రిక్షా, ఆటో, లారీ డ్రైవర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఉచిత నమోదుకు అక్రమ వసూళ్లు
పథకంలో చేరడానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు ఉండే కార్మికులు ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో రిజి స్ట్రేషన్‌ ఉచితంగా చేసుకునే వీలును కల్పించారు. కామన్‌ సర్వీసు సెంటర్లు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలు, సిఎస్‌జీ సెంటర్లు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదుకు అవకాశం కల్పించారు. కామన్‌ సర్వీసు సెంటర్‌లలో ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. పలువురు కామన్‌ సర్వీసు సెంటర్‌ నిర్వాహకులు కార్మికుల వద్ద రూ.50 నుంచి రూ.100 వరకు అక్ర మంగా వసూళ్లు చేస్తున్నారు. దీంతో నమోదుకు కార్మికులు ముందుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సిఎస్‌సి కేంద్రాలు అందుబాటులో లేకపోవడం నమోదు ప్రక్రియ నత్తనడకన సాగడానికి మరో కారణంగా నిలుస్తోంది. కార్మికులు తమతమ మొబైల్‌లో ఆన్‌లైన్‌ విధానంలో సైతం నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. నమోదైన వారికి పిఎం బీమా యోజన అమలు
ఈ శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రధానమంత్రి బీమా యోజన పథకం అమలు జరుగుతోంది. 16 నుంచి 59 సంవత్సరాల లోపు అసంఘటిత రంగాల్లో పనిచేసే వారంతా ఈ శ్రమ్‌లో నమోదుకు అర్హులే. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రమ్‌ పోర్టల్‌ను ప్రవేశ పెట్టారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి.
బిఎస్‌ఎం.వలీ, జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్‌