ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో వ్యవసాయ పంటల ఇ-క్రాప్ బుకింగ్ నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలు ఇప్పటి వరకు సుమారు 1.14లక్షల ఎకరాల్లో సాగవ్వగా అందులో కేవలం 30శాతం పంటలకు మాత్రమే ఇ-క్రాప్ నమోదైంది. దీంతో, రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నారు.
ఇ -క్రాప్ బుకింగ్ ఆధారంగానే ప్రభుత్వం పంటల బీమా, సున్నావడ్డీ కల్పిస్తున్న విషయం విధితమే. ఉత్పత్తులను కొనుగోలుచేసి, వాటికి కనీస మద్ధతు ధర కల్పించేందుకు కూడా ఇ-క్రాప్‌తోనే ప్రభుత్వం ముడిపెట్టింది. ఇ-క్రాప్ కింద గుర్తింపు పొందని రైతులు, ముఖ్యంగా ధాన్యం విక్రయంలో ఎన్ని ఇబ్బందులు ఎదర్కొన్నారో రైతాంగానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలో ఇ-క్రాప్ బుకింగ్ అనేది రైతులకు అత్యంత కీలకంగా మారింది. అమలు విషయంలో లక్ష్యానికి దూరంగా ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. మన జిల్లాలో ఖరీఫ్ సీజన్ అత్యంత ప్రాధాన్యతగలది. ఎక్కువ భూభాగంలో వర్షాధారంగానే పంటలు సాగవుతాయి కాబట్టి రబీలో పంటల నామమాత్రమే. ఖరీఫ్ సీజన్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, నువ్వులు, రాగులు, చిరుధాన్యాలు తదితర పంటలు కలిపి సుమారు 4లక్షల ఎకరాల్లో సాగువుతాయి. ఇందులో అత్యధికంగా వరి 2,23,025 ఎకరాల్లో సాగవుతుంది. ఆ తరువాత స్థానంలో మొక్కజొన్న, పత్తి, చెరకుసాగు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 1,14,285 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి 72,884 ఎకరాల్లో సాగైంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 16,832 ఎకరాలకు మాత్రమే ఇ-క్రాప్ నమోదైంది. మొక్కజొన్న 37,728 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, 19,156 ఎకరాల వరకు సాగైంది. ఇందులోనూ 1610 ఎకరాల మేర మాత్రమే ఇ-క్రాప్ బుకింగ్‌కు నోచుకుంది. పత్తిపంట విషయంలో మరీ దారుణంగా 2,938 ఎకరాలకు గాను 254 ఎకరాలను మాత్రమే గుర్తించారు. చెరకుసాగు సాగు పాత, కొత్త కలిపి 779 ఎకరాలు ఈ క్రాప్ కింద నమోదు చేశారు. నువ్వులు 2232 ఎకరాలు, రాగులు 101 ఎకరాల చొప్పున ఇ-క్రాప్ కింద చేర్చారు. ఈ నేపథ్యంలో రైతులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం సాంకేతిక సమస్యల వలే ఇ-క్రాప్ నెమ్మదిగా సాగుతోందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 30 నుంచి ఇ -క్రాప్ నమోదు ప్రారంభమైంది. సెప్టెంబర్ 15లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇ-క్రాప్ నమోదులో భాగంగా సంబంధిత రైతుల ఫోటోలను పొలంలోనే తీసి అప్‌లోడ్ చేయాల్సివుంది. ఇకెవైసి కూడా తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వేలాది ఆర్‌బికెలు ఇదే పనిలో వుండడం వల్ల సర్వర్ సహకరించడం లేదని ఆయా సిబ్బంది వాదన. జిల్లాలో చిన్నచిన్న భూ కమతాలు కావడం వల్ల ఉత్తరాంధ్ర మినహా ఇతర జిల్లాలతో పోలిస్తే రైతుల పరిధిలోని సర్వే నెంబర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మన జిల్లా పరిధిలో సుమారు 30.16లక్షల సర్వే నెంబర్లు ఉన్నట్టు సమాచారం. సర్వే నెంబర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎంట్రీలకు కూడా ఎక్కువ సమయం పడుతుందని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా పంటలన్నీ సకాలంలో ఇ-క్రాప్ బుకింగ్ కాకపోతే రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










