Aug 17,2023 19:39

రెండు జిల్లాల్లో లక్షా 70 వేల ఇళ్లు మంజూరు
ఇప్పటి వరకూ పూర్తయినవి 47,332 మాత్రమే
ఇంకా లక్షా 22 వేల అసంపూర్ణంగానే
ఎన్నికలలోపు పూర్తయ్యే ఇ ళ్లెన్నో
రెగ్యులర్‌ హౌసింగ్‌ పీడీ లేక ఏలూరు జిల్లావాసుల అవస్థలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రెండు జిల్లాల్లోనూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ప్రతి పేదవానికీ ఇల్లు నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీ ముందుకు సాగడం లేదు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ మంజూరు చేసిన ఇళ్లకు.. నిర్మాణం పూర్తయిన ఇళ్లకూ ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. మరో ఎనిమిది నెలల్లోపు సాధారణ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేనో అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెబుతున్న పథకాల్లో గృహనిర్మాణం ఒకటి. అలాంటి పథకాన్ని పర్యవేక్షించేందుకు ఏలూరు జిల్లాలో గృహనిర్మాణశాఖకు రెగ్యులర్‌ పీడీ కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ రెండు జిల్లాల్లో మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్ల నిర్మాణాల లెక్కలు పరిశీలిస్తే ఈ పథకం ఎంత నత్తనడకన సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు జిల్లాలో 28 మండలాలు ఉండగా వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు, పిఎంఎవై గృహనిర్మాణాల కింద 98,874 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకూ పూర్తయిన ఇళ్లు మాత్రం 23,181 మాత్రమే. ఇంకా 75,693 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లాలో 20 మండలాలు ఉండగా 71,283 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకూ పూర్తయిన ఇళ్లు 24,151 మాత్రమే. ఇంకా 47,132 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. దీన్నిబట్టి రెండు జిల్లాల్లోనూ పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పథకం ఎంత నత్తనడకన సాగుతుందో స్పష్టమవుతోంది. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక చోట్ల ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లస్థలాలు గృహ నిర్మాణాలకు అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికీ పూర్తికాకపోవడం అతిముఖ్యమైన కారణంగా లబ్ధిదారులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏమాత్రం సరిపోకపోవడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది.
రూ.లక్షా 80 వేలతో ఇల్లు పూర్తవుతుందా..?
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న సాయం కేవలం రూ.లక్షా 80 వేలు మాత్రమే. ఈ సొమ్ములు పునాదుల దశకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. సిమెంట్‌, ఐరన్‌, ఇసుక వంటి ధరలు ఆకాశంలో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలంలో ఇల్లు నిర్మించాలంటే తక్కువగా లెక్కించినా దాదాపు రూ.ఎనిమిది లక్షలు వరకూ ఖర్చవుతున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వం ఇచ్చే సాయం కాకుండా మరో రూ.ఆరు లక్షలుపైన అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత పెద్దమొత్తంలో అప్పు పుట్టే పరిస్థితి ఇళ్ల స్థలాల పొందిన లబ్ధిదారులకు లేదు. దీంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇల్లు కట్టకపోతే ఇంటి స్థలం వెనక్కి తీసుకుంటామని లబ్ధిదారులకు నోటీసులు వంటివి జారీ చేసినా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే సాయం పెంచడం లేదు. దీంతో లబ్ధిదారులు అప్పు చేసి ఇల్లు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం మాత్రం అన్నీ తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది. గృహప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం తేదీలు ప్రకటించడం వెనక్కి తగ్గడం పరిపాటిగా మారిపోయింది. ఇళ్ల నిర్మాణాలు అనుకున్న స్థాయిలో జరగకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అందించే సాయం పెంచితే లబ్ధిదారులు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది.