* సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున కేటాయింపు
* పనుల గుర్తింపు, ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం
* పాత పనులకు బిల్లులు రాకపోవడం మరో కారణం
* 1,844 పనులకు 313 మాత్రమే పూర్తి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగా చేపడుతున్న పనులపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయ పరిధిలో గుర్తించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఈ ఏడాది డిసెంబరు లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాలను నిర్ధేశిస్తున్నారు. గడప గడపకూ పనుల పూర్తిపై ప్రభుత్వం తొందరగా ఉన్నా, క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో పనులు చేపట్టిన వారికి బిల్లులు రాకపోవడంతో, స్థానిక వైసిపి నాయకులెవరూ ముందుకు రావడం లేదు. దీంతోపాటు ఎమ్మెల్యేలు 'గడప గడపకు' లక్ష్యాలను చేరుకోవడంతో వెనుకబాటు కనిపిస్తోంది. ఇళ్ల సందర్శన పూర్తయితే గానీ పనుల గుర్తింపు, మంజూరుకు అవకాశం లేకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అందిస్తున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటినీ ఎమ్మెల్యేలు సందర్శించేలా ప్రభుత్వం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని గతేడాది మే 11వ తేదీన ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లాలని ప్రజాప్రతినిధులను ఆదేశించింది. ఇందులో భాగంగా వారు పర్యటించిన ప్రాంతాల్లో మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు, ప్రజల నుంచి వచ్చే వినతుల కోసం సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున కేటాయిస్తూ గతేడాది ఆగస్టు 17న జిఒ నంబరు 123ను విడుదల చేసింది. పనుల గుర్తింపు, మంజూరు, నిర్వహణ, పర్యవేక్షణపై ప్రత్యేక మార్గదర్శకాలను వెలువరించింది. అందుకనుగుణంగా జిల్లాలో గతేడాది ఆగస్టు నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాల సందర్శన మొదలుపెట్టారు. జిల్లాలో 732 సచివాలయాలు ఉండగా అందరూ కలిపి 457 సచివాలయాలను సందర్శించారు. ప్రజాప్రతినిధుల నుంచి ఇప్పటివరకు 1844 పనులకు సంబంధించి మాత్రమే ప్రతిపాదనలు రాగా, వాటికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఇందుకు రూ.59.28 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటివరకు రూ.9.98 కోట్ల విలువైన 313 రకాల పనులు పూర్తయ్యాయి. మరో 1294 పనులు ప్రగతిలో ఉన్నాయి.
సాంకేతిక సమస్యలతో పనుల్లో జాప్యం
సచివాలయాల వారీగా గుర్తించిన పనుల జాబితాను ఎంపిడిఒలు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పంపుతున్నారు. వాటిలో నిబంధనల ప్రకారం ఉన్న పనులకు ఉన్నతాధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు. పనుల్లో అత్యధిక భాగం పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌శాఖలకు సంబంధించినవే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పంచాయతీరాజ్ ద్వారా చేపడుతున్న పనులపై ప్రభుత్వం కొత్తగా కొన్ని మార్గదర్శకాలు వెలువరించింది. గతంలో రూ.2.50 లక్షల పనిని నామినేషన్ పద్ధతిపై అప్పగించేవారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం వాటికీ టెండర్లను పిలవాలని ఉత్తర్వులు ఇచ్చినటు అధికారులు చెప్తున్నారు. ఈ కారణంతో పనుల్లో కొంత జాప్యమవుతున్నట్లు తెలుస్తోంది.
పనులకు ఆసక్తి చూపని నాయకులు
గడప గడపకు పనులు చేపట్టేందుకు గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలతో పాటు స్థానిక వైసిపి నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పనులు చేస్తున్నా సకాలంలో బిల్లులు రావడం లేదని వారు చెప్తున్నారు. దీంతోపాటు గతంలో ముఖ్యమంత్రి డెవలప్‌మెంట్ నిధులు (సిఎండిఎఫ్)తో పనులు చేసినా ఆ డబ్బులు ఇప్పటివరకు రాలేదు. సిఎండిఎఫ్ నిధులు మురిగిపోవడంతో బిల్లులు రావడం సందేహంగా ఉంది. పనుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా డబ్బులు మదుపు పెట్టడానికి ఎవరూ సాహహించడం లేదు. ఫలితంగా పనులు మంజూరవుతున్నా గ్రౌండింగ్ కావడం లేదు.
'గడప గడపకు మన ప్రభుత్వం'లో ఎమ్మెల్యేలు సందర్శించిన సచివాలయాలు, పనుల మంజూరు, పూర్తయిన పనుల వివరాలు
నియోజకవర్గం సచివాలయాలు సందర్శించినవి మంజూరు పూర్తయినవి
పలాస 88 71 320 37
ఆమదాలవలస 87 47 142 39
శ్రీకాకుళం 94 60 183 33
నరసన్నపేట 91 48 247 47
టెక్కలి 89 26 142 41
పాతపట్నం 91 58 177 47
ఇచ్ఛాపురం 94 58 291 24
ఎచ్చెర్ల 98 89 342 45










