Oct 07,2023 22:06

రాకపోకలు నిలిచిపోయిన రోడ్డు

ప్రజాశక్తి - నందిగామ : నందిగామ - రామన్నపేట రహదారి విస్తరణ పనులు గత ఆరు నెలల నుంచి మొక్కుబడిగా జరుగుతున్నాయి. జిల్లా కోర్టు వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులు మొదలై నెల రోజులైనా పూర్తి కాకపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం వల్ల నందిగామ - రామన్నపేట ప్రధాని రహదారిపై రాకపోకలు నిలుపుదల చేశారు. ఈ ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి. కృష్ణా జిల్లాతో పాటు కృష్ణానది అవతల ఉన్న గుంటూరు జిల్లా వాసులు కూడా ప్రయాణిస్తుంటారు. జిల్లా కోర్టు వద్ద రహదారి అడ్డంగా ఉన్న డ్రైనేజీపై రూ.7 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణం చేపట్టడంతో రాకపోకలు నిలిపి వేశారు. కల్వర్టు నిర్మాణంపై పనులు పూర్తి కాకపోవడంతో నెల రోజుల నుండి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రామన్నపేట రోడ్డు నుండి నెహ్రూ నగర్‌ పక్క రోడ్డు ట్రాఫిక్‌ డైవర్ట్‌ చేయడంతో ఇరుకు రోడ్లలో వాహనాలు రాకపోకలు సాగించడం ప్రయాణికులకు గగనంగా మారింది. ఆటోలు, కార్లు, ఇసుక బండ్లు, మోటారు వాహనాలు ఇరుకు రోడ్డుపై అతికష్టం మీద వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. స్కూల్‌ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్కూల్‌ పిల్లలను బస్సు ఎక్కించటానికి గాంధీ సెంటర్‌, పాత బైపాస్‌ రోడ్డు వరకు వెళ్లి ఎక్కించవలసి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇరుకు రహదారిపై వాహనాలు తిరగటం వల్ల ట్రాఫిక్కు సమస్య జటిలమైంది. సుమారు నెల రోజుల నుండి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కోర్టు వద్ద అరకొరగా సాగే వ్యాపారాలు రోడ్డు విస్తరణ పనుల వల్ల స్తంభించిపోవటంతో వ్యాపారులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. షాపుల ముందు, గోడౌన్ల ముందు పొక్లెయిన్లు పెట్టి దబాయిస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యము వల్ల పనులు ముందు కు సాగడం లేదని న్యాయవాదులు, స్థానికులు వాపోతున్నారు. జిల్లా కోర్టు వద్ద ఉన్న డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం త్వరితముగా పూర్తి చేసి రాకపోకలు పునరుదించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల బాధలు వర్ణనాతీతం... కాంసాని ఉదరు కుమార్‌, న్యాయవాది
రామన్న పేట రహదారిపై రాకపోకలు నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నెహ్రు నగర్‌ వైపు ట్రాఫిక్‌ డైవర్ట్‌ చేయడం వల్ల ఇరుకు రోడ్డులో వాహనాలు రాకపోకలకు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతుంది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కల్వర్టు నిర్మాణ పనులు నత్త నడక సాగుతున్నాయి. నాలుగురోజుల క్రితం డ్రైనేజీపై తాత్కాలికంగా వాహనాలు రాకపోకలకు అనుమతులు ఇచ్చిన ప్రమాదాలు జరుగుతున్నాయని మరల రాకపోకలు నిలిపి వేశారు. తక్షణమే జిల్లా కోర్టు వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు.
వారం రోజుల లలో పని పూర్తి చేస్తాం..
మున్సిపల్‌ ఎఇ ఫణి శ్రీనివాస రావు
జిల్లా కోర్టు వద్ద డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం పనులు వారం రోజుల లో పూర్తి చేస్తామని నందిగామ మున్సిపల్‌ ఎఇ ఫణి శ్రీనివాసరావు పేర్కొన్నారు. డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం పూర్తి కావడానికి మెటీరియల్‌ ఆలస్యం అవుతుందని తెలిపారు.
అప్రోచ్‌ పనులు మొదలు పెట్టాం... కమిషనర్‌ జయరాం
జిల్లా కోర్టు వద్ద డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం పూర్తి అయింది. కాంట్రాక్టర్‌ అప్రోచ్‌ పనులు చేపట్టవలసి వుంది. వారం రోజుల లో పనులు పూర్తి అవుతాయి.
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చేస్తాం... ట్రాఫిక్‌ ఎస్‌ఐ సురేష్‌
నందిగామ-రామన్నపేట రహదారిపై ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా పోలీసులను ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తాం.