Aug 27,2023 22:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు చాలా కీలకంగా ఉన్నాయి. కొన్ని సొంత భవనాల్లోనే నిర్వహిస్తుండగా ఇంకొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలుచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో లబ్ధిదారులు, సిబ్బంది భయం భయంగా గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. పనులు ప్రారంభమై ఏడాది పైగా గడుస్తున్నా నేటికీ ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు.
కాకినాడ జిల్లాలో 10 ప్రాజెక్టుల పరిధిలో 1986 మెయిన్‌, మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 70 శాతం సొంత భవనాలుండగా మిగిలినవి అద్దె భవనల్లో కొనసాగుతున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ 1.38 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 11,518 మంది బాలింతలు, 13,134 మంది గర్భవతులు ఉన్నారు. జిల్లాలో 1986 కేంద్రాల్లో 706 సొంత కేంద్రాలు ఉండగా 1107 అద్దె భవనాల్లో, రెంట్‌ ఫ్రీలో 173 నడుస్తున్నాయి.
రెండో దశ నాడు-నేడు పనుల్లో భాగంగా చేపట్టిన భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు మొదలై ఏడాది కావస్తున్నా నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం కారణంగానే ఆలస్యం అవుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు.
98 భవనాలు మంజూరు
నాడు నేడు రెండో విడతలో భాగంగా గతేడాది జూలై 26న 98 అంగన్వాడి నూతన భవనాలు మంజూరయ్యాయి. ఒక్కోదానికి రూ.13.5 లక్షలు, ఫర్నిచర్‌ కోసం రూ 2.5 లక్షలు కేటాయించారు. పంచాయతీరాజ్‌, సమగ్రశిక్షాభియాన్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, మున్సిపల్‌, పబ్లిక్‌ హెల్త్‌ తదితర శాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిలో ఒక్కటి కూడా పూర్తి కాకపోగా 28 భవనాలు పునాదుల దశలోనే ఉన్నాయి. 14 మాత్రమే స్లాబులు వేశారు. ఇంకా 56 భవనాలు రూఫ్‌ లెవెల్‌ (పైకప్పు స్థాయి) వరకూ మాత్రమే పూర్తయ్యాయి. వాస్తవానికి ఈ నెల జూన్‌ నాటికే అన్ని భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. కిర్లంపూడి మండలం జెపి.నగరం, పాలెం, ఎస్సార్‌ పేట, వేలంక, ఉప్పరపేట, ప్రత్తిపాడు మండలం గర్జనపూడి,తొండంగి మండలం ఎ.కొత్తపల్లి, గడ్డిపేట, నరసరావుపేట, ఒంటిమామిడి, కె.కోదాడ, ఎ.అగ్రహారం తదితర ప్రాంతాల్లో పునాదులు దాటలేదు. జగ్గంపేట మండల కేంద్రంలో మార్కెట్‌, సీతానగరం, కిర్లంపూడి మండలం సింహాద్రిపురం, గోనేడ, వేలంక, ఎస్‌ఎస్‌.లంక, పెద్దాపురం మండలం ఆర్‌బి.పట్నం, కట్టమూరు, ఆనూరు, వాలు తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో స్లాబు దశ వరకు చేసి పనులు ఆగిపోయాయి. ఇలా అన్నిచోట్లా పనులు మధ్యలోనే ఉండిపోయాయి. సంవత్సరం కాలం గడిస్తున్న ఒక్కచోట కూడా పూర్తి కాలేదు.
నిధులు విడుదలలో జాప్యం
నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ప్రతి నెలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుండడంతో పలు భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక్కో భవనానికి రూ.13.5 లక్షలు కేటాయించగా కేవలం 15 శాతం అంటే రూ.2 లక్షల 40 వేలు మాత్రమే ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేశారు. దాంతో పనులు చేయలేక, చేసేదేమీ లేక మధ్యలో నిలిపివేశామని నిర్మాణదారులు చెబుతున్నారు.