May 28,2023 23:33

అంధకారంలో హైకోర్టుకు దారితీసే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు

ప్రజాశక్తి - తుళ్లూరు : హైకోర్టుకు దారి తీసే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు,ఇతర రహదారుల్లో విద్యుత్‌ దీపాల ఏర్పాటు నత్తనడకన సాగుతోంది. విద్యుత్‌ దీపాలు లేకపోవడంతో రహదారులు అంథకారం అలముకుంది. హైకోర్టుకు దారితీసే మార్గాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని కోరుతూ ఏపి హైకోర్టు ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు వీధి దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఆర్‌డిఎ కమిషనర్‌ను ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నామని, జూన్‌ చివరి నాటికి వీధి దీపాల ఏర్పాటు పూర్తి అవుతుందని సిఆర్‌డిఎ తరుపు న్యాయవాది ఇటీవల కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణను జూన్‌ 20 వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వీధి దీపాల ప్రక్రియ ప్రారంభైనా నత్త నడకన సాగుతోందనే విమర్శలు ప్రజల నుండి వినవస్తున్నాయి. హైకోర్టుకు దారితీసే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పై న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజధాని గ్రామాలు ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు రాకపోకలు సాగిస్తుంటారు. వీధి దీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీధిదీపాలు ఏర్పాటు ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.