Apr 22,2023 00:45

బాధిత కుటుంబాలకు పరిహారం డిడిలు అందజేస్తున్న మంత్రులు అప్పలరాజు, రాజా, ఎంపి గీత, కలెక్టర్‌ కృతికాశుక్లా




- మంత్రులు సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా
ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌
ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక పరిహారాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలను అభివృద్ది చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాలు పిలుపునిచ్చారు. పెద్దాపురం మండలం, జి.రాగంపేటలోని ఎఎస్‌ అగ్రోస్‌ ఫ్యాక్టరీలో గత ఫిబ్రవరి నెల 9వ తేదీన జరిగిన ప్రమాదంలో మరణించిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ఒక్కక్కరీకీ ప్యాక్టరీ యాజమాన్యం రూ.25 లక్షలు, ప్రభుత్వం రూ.25 లక్షలు వెరశి రూ.50 లక్షలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఆర్‌అండ్‌బి మంత్రి దాడిశెట్టి రాజాలు పంపిణీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు మతుల కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఎక్స్‌గ్రేషియా మొత్తం రూ.25 లక్షలు, ఆయిల్‌ ఫ్యాక్టరీ వర్క్స్‌మన్‌ కాంపన్‌సేషన్‌ చట్టం కింద చెల్లించిన రూ.25 లక్షలు వెరసి మొత్తం రూ.50 లక్షల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ ప్రమాదంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలానికి చెందిన ఎస్‌.టి వర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులు, పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన ఇరువురు బిసి వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మతులు వెచ్చంగి కృష్ణ, వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌, కురవడు బొంజుబాబు, కుర్రా రామారావు (ఎఎస్‌ఆర్‌ జిల్లా), కట్టమూరి జగదీష్‌, యల్లమిల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులకు మంత్రి ఈ సహాయాలను అందజేశారు. ప్రమాదవశాత్తు కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఆ లోటును కొంతవరకైనా తీర్చి, ఆయా కుటుంబాలను ఆదుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఆప్తులను కొల్పోయిన కుటుంబాలకు ఆర్హత మేరకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిస్తామన్నారు. జి.రాగంపేట సంఘటన మతుల్లో 5గురు ఎస్‌.టి.ల కుటుంబాలకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా లక్ష రూపాయల సహాయాన్ని ఎఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే జారీ చేశారని, అలాగే ఒక్కొక్క కుటుంబానికి ఎకరం భూమి పంపిణీకి ప్రతిపాదించడం జరిగిందన్నారు. అలాగే మృతులలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద అర్హులైన నలుగురికి కుటుంబాలకు ఒక్కక్కరికీ ఐదు లక్షల పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపి వంగా గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, అరకు ఎyంఎల్‌ఎ చెట్టి ఫాల్గుని, పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, డిఆర్‌ఓ కె.శ్రీధరరెడ్డి, పెద్దాపురం ఆర్డిఓ జె.సీతారామారావు, ఫాక్టరీస్‌ డిప్యూటీ ఛీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.రాధాకష్ణ, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లాబర్‌ జి. లక్ష్మీనరసయ్య, తహశీల్దార్‌లు వజ్రపు జితేంద్ర, శివకుమార్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.