May 14,2023 23:42

మాట్లాడుతున్న రోడ్డు విస్తరణ బాధితులు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:నర్సీపట్నం రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోతున్న బాధితులకు పరిహారమే చెల్లించాలని పలువురు డిమాండ్‌ చేశారు. రోడ్డు విస్తరణ బాధితుల అసోసియేషన్‌ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు మాట్లాడుతూ, రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వారికి టిడిఆర్‌ బాండ్లు వద్దని, నష్టపరిహారమే చెల్లించాలని అసోసియేషన్‌ బిల్డింగ్‌ వద్ద ప్లకార్డులతో నిరసన చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు విస్తరణ చట్ట పరంగా లేదని మాస్టర్‌ ప్లాన్‌ డిడిసిపిలో చూసినట్లయితే ప్లాన్‌ అప్రూవల్‌ లేదని ప్రపోస్డ్‌ ప్లాన్‌ అని ఉందన్నారు. అధికారులు చట్టపరంగా రోడ్డు విస్తరణ చేయలేదన్నారు. ఎలమంచిలి మున్సిపాలిటీ ప్లాన్‌ను పరిశీలిస్తే అప్రూవల్‌ గా ఉందన్నారు. 15 రోజుల్లో రోడ్ల విస్తరణ చేపడుతున్నట్లు వస్తున్న వార్తలను విని వ్యాపారస్తులు, భవన యజమానులు ఆందోళన చెందుతున్నారని షాపులు ఖాళీ చేయాలంటే సుమారు మూడు నుంచి ఆరు నెలలు సమయం కావాల్సి ఉంటుందన్నారు. సమయం ఇవ్వకుండా 15 రోజుల్లో ఖాళీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. తమకు టిడిఆర్‌ బాండ్లు వద్దని 80 అడుగులు విస్తరణ చేపడితే ఎటువంటి బాండ్లు నష్టపరిహారం కూడా వద్దని చెప్పామని గుర్తు చేశారు. తాము 14 అంశాలను మున్సిపాలిటీలో వివరించామని తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలిపారు. షాపులు ఖాళీ చేయాలంటే ఎంతో మంది నష్టపోతున్నామని, తాము బతకాలని, ఈ షాపులపైనే తమ జీవనం ఆధారపడి ఉందన్నారు. నర్సీపట్నంలో రోడ్లు విస్తరణకు తాము సహకరిస్తామని 100 అడుగుల నుంచి 80 అడుగులకు చేయాలని కోరారు. ఎమ్మెల్యే, పాలకమండలి పున:ఆలోచించాలని తెలిపారు.