తక్షణమే ఇవ్వాలని : సిపిఎం నేత లోతా రామారావు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని లోదొడ్డి గ్రామంలో ఏడాది క్రితం విషపూరితమైన జీలుగు కళ్లు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు నేటికీ నష్టపరిహారం చెల్లించకపోవడంపై మృతుల కుటుంబాలు గురువారం గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు మాట్లాడుతూ విష ప్రయోగమైన జీలుగు కళ్ళు తాగి ఏడాది క్రితం లోదొడ్డి గ్రామానికి చెందిన చెదల సుగ్రీవు, వేమ లోవరాజు, బూసరి సన్యాసిరావు, పొత్తూరు గంగరాజు, కె ఏసుబాబు మృతి చెందారని, ఈ విషాదకర సంఘటన జరిగి నేటికీ సంవత్సరం అవుతున్నా నేటికీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. ఆనాడు ప్రజా ప్రతినిధులు, అధికారులు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఐదు కుటుంబాలకు ప్రభుత్వం తప్పకుండా ఆర్థిక సహాయం అందజేస్తుందని గొప్పలు చెప్పారని గుర్తు చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, జిల్లా అధికారులు, వైసిపి నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మొసలి కన్నీరు కార్చి చేసిన వాగ్దానాలను అమలు చేయడం వారు విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ సంఘటన తర్వాత అనేక ప్రమాదాల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించిందని, కాని లోదొడ్డి గ్రామంలో మృతుల కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బుటారి రాజబాబు, సిపిఎం మండల నాయకులు కొత్తూరు సత్యనారాయణ జర్తా రాజబాబు, కె నాగరాజు, రాజుబాబు, మురళి, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










