
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని చందనాడ దళితుల భూములకు నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. వైజాగ్ - చెన్నై ఇండిస్టియల్ కారిడార్ కోసం చందనాడ చెందిన దళితులు గుళ్ళ బట్టీలు నిర్వహిస్తున్న భూములను, డి పట్టా భూములను అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంపై దళితులు తమ సమస్యను లోకనాథం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆయన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ, గ్రామానికి చెందిన దళితులు పూర్వం నుండి గుళ్ళ బట్టీలు నిర్వహిస్తూ ఉపాధి పొందడం జరుగుతుందన్నారు. వైజాగ్ చెన్నై ఇండిస్టియల్ కారిడార్ కోసం ప్రభుత్వం దళితుల ఆధీనంలో ఉన్న డీ పట్టా భూములను సేకరించిందని తెలిపారు. నేటి వరకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. వెంటనే దళితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, మండల కార్యదర్శి ఎం.రాజేష్, స్థానికులు పెదపూడి రమణ, యేడిద సన్యాసి, యేడిద మన్నియ్య, యేసు, దేముడు తదితరులు పాల్గొన్నారు.