Nov 05,2022 23:52

గ్రామంలో పర్యటిస్తున్న అప్పలరాజు, గ్రామస్తులు

ప్రజాశక్తి-నక్కపల్లి:వైజాగ్‌-చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ కోసం సేకరించిన చందనాడ దళితుల డీ ఫారం భూములకు, గుల్ల బట్టీల భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, సిపిఎం మండలం కార్యదర్శి ఎం.రాజేష్‌లు డిమాండ్‌ చేశారు. శనివారం చందనాడ లో దళితులు భూములను పరిశీలించారు. దళితులు తమ సమస్యను అప్పలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, 1975 సంవత్సరంలో చందనాడ దళితులకు ఆనాటి ప్రభుత్వం గ్రామంలోని సర్వే నెంబర్లు 120/5లో 18 ఎకరాలు 6 మందికి, సర్వే నెంబర్లు 135,137,138లలో 43 ఎకరాల 23 సెంట్లు 26 మందికి డీ.ఫారం భూములు ఇచ్చిందని, వాటిని నమ్ముకుని దళితులు జీవిస్తున్నారని తెలిపారు. ఈ భూములు అభివృద్ధికి ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు అర్ధిక సహాయం అందించారని, వీటితో పాటు తరతరాలుగా సంప్రదాయంగా చందనాడ రెవెన్యూ సర్వే నెంబర్లు 65/2, 65/3లలో సుమారుగా 10 ఎకరాల 50 సెంట్లు భూములలో గుల్లబట్టీలలో గుల్ల కాల్చుకొని తద్వారా జీవనోపాధిని పొందు తున్నారని తెలిపారు. వైజాగ్‌ -చెన్నై ఇండిస్టీల్‌ కారిడార్‌ పేరుతో దళితులకు చెందిన డీ ఫారం, గుల్ల బట్టీల భూములను కూడా అధికారులు సేకరించారని, కాబట్టి ఆ భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. దళితులకు ఈ భూములు తప్ప వేరొక ఆధారం లేదని నిరుపేదలని, వారి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దళితుల డి ఫారం భూములను అధికారులు ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. వెంటనే భూముల సర్వేలు పూర్తి చేసి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దళితులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందనాడ దళిత నాయకులు ఏడిద సన్యాసి, ఏడిద మన్నియ్య, ఏడిద పోతురాజు, పెదపూడి సువర్ణరాజు, ఏడిద దేముళ్ళ, గోరింట పోతురాజు, ఏడిద ఏసు, ద్రాక్షారపు రాజు, ఏడిద నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.