నష్టపరిహారాన్ని లెక్కించండి
- దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించాలి
- ఐటి అండ్ సి శాఖ కార్యదర్శి కోన శశిధర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించి నష్టపరిహారాన్ని లెక్కించాలని ఐటి అండ్ సి శాఖ కార్యదర్శి, స్పెషల్ అధికారి కోన శశిధర్ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. నష్ట పోయిన ప్రతి రైతును కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లోని వైయస్సార్ సెంటనరీ హాలులో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, స్పందన గ్రీవెన్స్ క్వాలిటీ డిస్పోజల్‌పై జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3012 హెక్టార్లలో వివిధ రకాల పంటలు, 123 హెక్టార్లలో ఉద్యాన పంటలు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నాయని, మరో రెండు రోజులపాటు వర్షం ఉన్న నేపథ్యంలో దెబ్బతిన్న పంటల ప్రతి రైతు పొలం దగ్గరకు వెళ్లి స్వయంగా పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించేందుకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు అత్యంత చురుకుగా పనిచేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున భరోసా కల్పించాలని సూచించారు. దెబ్బతిన్న పంట ఉత్పత్తులను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జెసికి సూచించారు. వర్షం పడితే మధ్య దళారులు మార్కెట్ యార్డులలో అతి తక్కువ ధరకు వేలం పాట పాడుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జగనన్నకు చెబుదాం అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రజల నుండి వచ్చే వినతుల్ని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 9వ తేదీ నుండి ప్రవేశపెడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, పశు సంపద, నష్టపోయిన శాఖల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ అధికారికి వివరించారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలోని ఏడెనిమిది మండలాలు అకాల వర్షానికి ప్రభావితమయ్యా యన్నారు. శ్రీశైలంలో కొన్ని గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి కామేశ్వరరావు, ఆత్మకూరు, నంద్యాల ఆర్డీవోలు ఎం దాసు, శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










