ప్రజాశక్తి-బాపట్ల: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ గురువారం బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టరు చామకూరి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షాలతో నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి కురిసిన భారీ వర్షాలతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పంటలు నీటిలో నాని నష్ట తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. వర్షాలకు పంట దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంద న్నారు. పంట నష్టాన్ని అంచనా వేయకుండా, ఉన్న పంటను కాపాడుకోవడానికి కనీసం టార్పాలిన్ పట్టలు కూడా ఇవ్వకుండా రైతుల్ని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. వర్షాల ధాటికి ధాన్యంతో పాటు మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, బత్తాయి దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని అన్నారు. మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని కోరారు. రాయితీపై విత్తనాలు అందజేసి రైతులను ఆదుకోవాలన్నారు. నాణ్యత కోల్పోయిన వివిధ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతుకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం అందజేయాలన్నారు. పంట నష్టం అంచనా వేసి త్వరితగతిన పరిహారం అందించాలని కోరుతూ జెసికి వినతిపత్రం అందజేశామని నరేంద్రవర్మ తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, బాపట్ల పట్టణ, మండల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










