
ప్రజాశక్తి - చింతలపూడి
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా కన్వీనర్ రాయంకుల లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ఉర్లగూడెం, కనిపెడ, బాలవారిగూడెం తదితర గ్రామాలలో ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో పంటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావంతో మండలంలో 250 ఎకరాలు పూర్తిగా వరిపంట ఎండి పోవటంతో పొలాల్లో పశువులను మేతగా మేపారని తెలిపారు. సాగు చేసిన రైతులు ఆర్థికంగా ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టగా, పూర్తిగా దెబ్బతిందన్నారు. పంటనష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలిపారు. తదుపరి రాబోవు ఖరీఫ్‌కు చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి పై తెలిపిన గ్రామాలకు సాగునీరు శాశ్వత ప్రాతిపదికగా అందించాలని కోరారు. ఈ పర్యటనలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, రైతు నాయకులు తక్కెలపాటి ప్రసాద్, తాడిగడప మాణిక్యాలరావు, ఎస్‌కె.జాని, తదితరులు పాల్గొన్నారు.