Aug 05,2023 21:15

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు
అయోధ్యలంకలో సిపిఎం రాష్ట్ర కమిటీ బృందం పర్యటన
ప్రజాశక్తి - ఆచంట
ఇటీవల గోదావరి వరదల కారణంగా నష్టపోయిన లంక గ్రామ రైతులకు యుద్ధ ప్రతిపాదికన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. శనివారం మండలం అయోధ్యలంక గ్రామంలో సిపిఎం రాష్ట్ర కమిటీ బృందం సభ్యులు ముంపున గురైన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఇటీవల సంభవించిన గోదావరి వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో అరటి, కొబ్బరి, మునగ, తమలపాకు, బీర, బెండ, చిక్కుడు, పచ్చిమిర్చి తోపాటు పలు రకాల ఆకు కూరల పంటలు కూడా పూర్తిగా నీట మునిగి నష్టపోయారన్నారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారని, కోతకొచ్చే సమయంలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తగ్గిన తర్వాత కూడా లంక భూముల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో అదనంగా మరో రూ.25 వేల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని రైతులు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రభుత్వం లంకగ్రామాల రైతులను ఆదుకోకపోతే అప్పుల ఊబిలోకి కూరుకుపోతారని, తక్షణం యుద్ధ ప్రతిపాదికన నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యనారాయణ, కె.హరిబాబు, మాల్యాద్రి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌, మండల కమిటీ సభ్యులు సిర్రా నరసింహమూర్తి, అయోధ్యలంక శాఖ కార్యదర్శి దాసరి రమేష్‌, నాయకులు దాసరి బాలయ్య, సరేళ్ల రాధాకృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.