ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్:అకాల వర్షాలకు తడిసిన పసుపును ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు అన్నారు. గురువారం ఎంటీఎంసీ పరిధిలోని పాతూరులో రైతు సంఘం నాయకులతో కలిసి, తడిసిన పసుపు కల్లాలను అయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పసుపు క్వింటాల్ రూ.6850లకు కొనుగోలు చేయడం లేదని అన్నారు. తడిసిన పసుపు రంగు(కటుకు) మారిందనే కారణంతో ప్రైవేట్ వ్యాపారస్తులు పసుపు రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. తక్షణమే మద్దతు ధరకు పసుపును కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జొన్న, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పసుపు, జొన్న, మొక్కజొన్న పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు డి.రాజేంద్ర బాబు, ఎస్. వెంకటేశ్వరరావు, ఆదం, సాంబయ్య పాల్గొన్నారు.
తెనాలిరూరల్: నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం అందించాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అన్నారు. గురువారం దెబ్బతిన్న పంటపొలాలను, కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, జొన్నను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆరుగాలం పండించిన పంట పొలాలను, రైతులను పరామర్శించకపోవడం దారుణమన్నారు. క్షేత్ర స్థాయిలో పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్బికెలు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో రైతులను ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు.
దుగ్గిరాల:అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు, కౌలు రైతులను ఆదుకోవాలని దుగ్గిరాల మండల ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ప్రజాసంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు ఒక ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ జొన్నా, మొక్కజొన్న పంటలు గతనెల నుండి కురుస్తున్న వర్షాలకు తడిసి పోయాయని అన్నారు. రేఖలు తీసిన కండెలు కూడా వర్షంలో తడిసి రంగు మారిందని, తోడు మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు. తడిచిన పంటను అర్‌బికె ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించక పోతే మే 9న రైతు, కౌలు రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, రైతు సంఘం మండల కార్యదర్శి వైబ్రహ్మేశ్వరావు, కౌలురైతు సంఘం మండల కార్యదర్శి యం. నాగమల్లేశ్వరావు ,రైతు సంఘం నాయకులు వి సాంబశివరావు కౌలురైతు సంఘం మండల అధ్యక్షులు బి అమ్మిరెడ్డి పాల్గొన్నారు.
తెనాలి:అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కె. రవి బాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం అంచనాలు వేయడంలో ప్రభుత్వం వెనకబడిందన్నారు. కల్లాల్లో ఆరబోసిన జొన్న, మొక్కజొన్న వర్షానికి తడిసి రైతుల అల్లాడుతుంటే కనీసం అధికారులు దానిపై పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రైతుల ప్రయోజనం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆర్భాటంగా చెబుతున్న ప్రభుత్వం రైతుల పరిస్థితికి సమాధానం చెప్పాలన్నారు. నాయకులు టి హరి ప్రసాద్, కె కోటేశ్వరరావు, ఎ పిన్నారావు, ఈదర పూర్ణచంద్, జె. మహేష్, కె. ఏడుకొండలు ఉన్నారు
పొన్నూరు రూరల్ :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మద్ధతు ధరకు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తెల్లజొన్న , మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. గురువారం స్థానిక ఐలాండ్ సెంటర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం స్థానిక వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుమలదేవికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధరకు లేక మరోవైపు అకాల వర్షానికి చేతికొచ్చిన పంటకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నూరు పట్టణ,మండల టిడిపి అధ్యక్షులు బండ్లమూడి బాబురావు, చేబ్రోలు మండల అధ్యక్షులు మైలా వెంకట రామరాజు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి వడ్రాణం హరిబాబు, తదితరులు పాల్గొన్నారు
కొల్లిపర: నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టిడిపి మండల అధ్యక్షులు భీమవరపు చిన్న కోటిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం డిప్యూటీ తహశీల్దార్ బాలకృష్ణారెడ్డికి టిడిపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వర్షాల వలన దెబ్బతిన్న పసుపు, మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగ సాంబిరెడ్డి గుదిబండి గోవర్ధన్ రెడ్డి అమతరాజు బొంతు చంద్రిక ఆరిమండ వెంకటరెడ్డి బసవయ్య రఫీ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు










