May 08,2023 00:15

మాట్లాడుతున్న ఇంతియాజ్‌ అహ్మద్‌, కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు : జిల్లాలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులకు వివరించాలని జిల్లా ప్రత్యేకాధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషనల్‌ సీసీఎల్‌ఏ, సెర్ప్‌ సిఇఒ ఇంతియాజ్‌ అహ్మద్‌ చెప్పారు. అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టంపై వ్యవసాయ, మార్కెటింగ్‌, రోడ్లు-భవనాలు, పంచాయితీ రాజ్‌ శాఖాధికారులతో ఇంతియాజ్‌ అహ్మద్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జెసి రాజకుమారితో కలసి కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో ఆదివారం సమీక్షించారు. అకాల వర్షాల కారణంగా 7,965.5 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న పంటలకు, 40 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు వివరించారు. ఇంతియాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు, రబీలో సాగు చేస్తున్న పంటలకు పంటల బీమా పథకం అమలు చేస్తుందన్నారు. జిఒ 66, 67 ప్రకారం పంటల బీమా వర్తిస్తుందని, ఇన్‌పుట్‌ సబ్సిడి అందిస్తుందని చెప్పారు. జిల్లాలో 170 ఆర్‌బికెల ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఇప్పటికే ప్రారంభమైందని, రైతులు అధైర్యపడవద్దని తెలియజేయడంతో పాటు, వర్షం తగ్గిన తరువాత వాస్తవిక పంట నష్టం అంచనాను రూపొందించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఈ అంశాలను రైతులకు వివరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది ఇదే నెలలో 10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవగా ఈ ఏడాది 100 మిల్లీ మీటర్లు నమోదైనట్లు తెలిపారు. కొన్ని మండలాలో 170-175 మిల్లీ మీటర్ల వరకు వర్షాలు పడ్డాయన్నారు. పంట నష్టం అంచనాలు తయారీకి బృందాలను సిద్ధం చేశామన్నారు. ఉద్యాన పంటలైన అరటి, మిర్చి పంటలపై, కళ్లాల్లో, పొలాల్లో వున్న, దెబ్బతిన్న మొక్కజొన్న, మిర్చి పంటలపైనా సమీక్షించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లలిత, జిల్లా ఉద్యాన శాఖాధికారి సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.