Nov 18,2023 21:19

విలేకరులతో మాట్లాడుతున్న ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు

              ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌     జిల్లాలో పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు చెల్లించాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎపి రైతుసంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 9.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారన్నారు. వీటిలో 2.28 లక్షల ఎకరాల్లో కేవలం వేరుశనగ సాగైందన్నారు. అయితే వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయన్నారు. ఆఖరికి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. ఈనేపథ్యంలో కరువు మండలాలు ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తే స్పందించిన ప్రభుత్వం కరువు సహాయం నష్టం అంచనా వేసేందుకు జీవో 5ను విడుదల చేసిందన్నారు. అయితే దీని ద్వారా రైతులకు వేరుశెనగ పత్తి పంటలకు (హెక్టార్లలో) రూ.17వేలు, జొన్న, సజ్జ, ఆముదం పంటలకు రూ.8,500, కంది, ఆపరాలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌ పంటలకు రూ.10వేలు, మొక్కజొన్న పంటకు రూ.12,500 ఇస్తామని ప్రకటించిందన్నారు. అయితే ఇలా ఇవ్వడం ద్వారా రైతులకు ఏమాత్రం మేలు చేకూరదన్నారు. కావున జీవో.5ను సవరించి ఏ పంట సాగు చేసినా కనీసం ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోతులయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి, లక్ష్మీదేవి, సువర్ణమ్మ, చిదంబరమ్మ, నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, సూర్య, కొండారెడ్డి, వెంకట కొండ, తదితరులు పాల్గొన్నారు.