Oct 21,2023 16:30

ప్రజాశక్తి - చింతలపూడి
    వరి సాగు చేస్తున్న పొలాలను సర్వే నెంబర్లు ఆధారంగా సర్వే చేసి, ప్రకృతి విపత్తు వలన నష్టపోయిన పొలాలకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చింతలపూడి మండలం, సమ్మిటివారిగూడెం, మల్లాయగూడెం గ్రామాల్లో ఎపి రైతు సంఘం, సిపిఐ ఆధ్వర్యంలో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడక నష్టపోయిన వరి పంటను రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, పంట నష్టం ఎన్ని ఎకరాల్లో జరిగిందో ప్రభుత్వానికి నివేదించాలన్నారు. నష్టపరిహారం ఎకరాకు రూ.20 వేలు అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలో ఎక్కువ శాతం చెరువులపై ఆధారపడి, వరి వ్యవసాయం నిర్వహిస్తున్నారని, కానీ ఈ సంవత్సరం వర్షాభావ ప్రభావం తక్కువ వలన ఈ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. అదే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఉంటే ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలో ఉన్న చెరువులను అనుసంధానం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం తక్షణం పూర్తి చేయాలన్నారు. మండలంలోని చెరువుల ఆక్రమణ జరిగాయని ఆ ఆక్రమణలు తొలగించి, చెరువులను అభివృద్ధి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ మండలంలోని సమ్మెటవారి గూడెం, మల్లాయగూడెం, పోతునూరు, ప్రగఢవరం, ఉర్లగూడెం గ్రామాల్లో పూర్తిగా వరి పంట ఎండిపోయే స్థాయికి వచ్చిందన్నారు. మండలంలో సుమారు మూడు వేల ఎకరాల్లో నష్టం జరిగిందని, దీనిని రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే నెంబర్‌ ఆధారంగా నష్టాన్ని అంచనా వేయాలని తెలిపారు. ఈ పర్యటనలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, ఎపి రైతు సంఘం నాయకులు రావెళ్ల రాజా, తక్కిలపాటి ప్రసాద్‌, వంగళ్లపూడి ఆదినారాయణ, సిపిఐ చింతలపూడి పట్టణ కార్యదర్శి ఎస్‌కె.జానీ పాల్గొన్నారు.