Nov 13,2023 23:59

కుంచనపల్లిలో మైకు ప్రచారంలో డి.రమాదేవి, ఇతర నాయకులు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్ర మోడీ, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి పిలుపునిచ్చారు. కుంచనపల్లిలో సిపిఎం నిర్వహించిన మైకు ప్రచారాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వన అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం వలన నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. వ్యవసాయ రంగం మొత్తం నిర్వీర్యం చేసేందుకు, కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మూడు నల్ల చట్టాలను మోడీ తెచ్చారని, అయితే వాటిని రైతులు తమ మహోద్యమం ద్వారా తిప్పికొట్టారని చెప్పారు. మతోన్మాద శక్తులు దేశంలో వివిధ మతాలు మధ్య చిచ్చుపెట్టాయని, మహిళల పైన దాడులు నిర్వహించటం, మహిళలపై అత్యాచారాలు జరగటం బిజెపి ప్రభుత్వ హయాంలోనే అధికమయ్యాయి అన్నారు. మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఘటన బిజెపి పరిపాలన కు నిదర్శనంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో సరైన ఉపాధి లేక పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. ఒకపక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కార్పొరేట్‌ శక్తులకు మోడీ ప్రభుత్వం అమ్మి వేస్తుంటే వైసిపి, టిడిపి, జనసేనలు మోడీ భజన చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో అసమానతలు లేని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజారక్షణ బేరి సభ జరుగుతుందన్నారు. సభకు అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి, సామాన్య ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మైకు ప్రచారం ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు, మెల్లెంపూడి, వడ్డేశ్వరం కొలనుకొండ గ్రామాల్లో సాగింది. రాష్ట్ర నాయకులు దయా రమాదేవి, సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు, కె.శివరామకృష్ణయ్య, మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, కుంచనపల్లి మాజీ సర్పంచ్‌ ఎ.సాంబయ్య, నాయకులు డి.శ్రీనివాసకుమారి, కె.యశోద, ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, బి.వెంకటేశ్వరరావు, బి.దశరథరెడ్డి, గోపాలరెడ్డి, కె.వెంకటయ్య, డి.రాజేంద్రబాబు, బి.ప్రసాద్‌ పాల్గొన్నారు.