Sep 06,2023 23:39

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేసిన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు డిమాండ్‌ చేశారు. మండలపరిధిలోని బొల్లాపల్లి గ్రామంలో జిల్లా రైతుసంఘం విస్తత స్థాయి సమావేశం పనక రామాంజనేయులు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా రామారావు మాట్లాడుతూ జిల్లా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఖరీఫ్‌లో సకాలంలో సాగు చేయలేక పోయినట్లు తెలిపారు. కొంత మంది రైతులు బోర్ల క్రింద పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ కోతల కారణంగా ఆ పంటలు ఎండిపోయిటనట్లు తెలిపారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. కందిమళ్ల రామకోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్‌ కోతల కారణంగా ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన రైతులకు అప్పులే మిగిలే పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఖరీఫ్‌లో పంట సాగు చేసి నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రబీలో సాగు చేసేవారికి విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలన్నారు. వ్యవసాయ మోటార్లకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందించాలన్నారు. కొమ్మమూరు కాలువ పరిధిలోని చివరి భూములకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. వర్షాలు తిరిగి మొదలైన కారణంగా రబీ పంట కాలంలో ప్రత్యామ్నాయ పంటలు గురించి వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, బత్తుల హనుమంతరావు, పాలేపు సాంబయ్య, నాగేశ్వరరావు, మల్లారెడ్డి, ఎనికపాటి రాంబాబు, మానం సుబ్బారావు, ఇందుర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.