
మతాంజ్యంలో మహిళలను సాటి మానవులుగా కూడా గుర్తించరు. నిత్యం వారిపై అణచివేత రాజ్యమేలుతోంది. వారి హక్కులు హరించబడతాయి. స్వేచ్ఛ కోల్పోతారు. విద్య, ఉపాధి కరువై ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అటువంటి చోట ఈ దుశ్చర్యలకు ఎదురొడ్డి ఎందరో మహిళలు ఆయా దేశాల్లో తమ వాణిని బలంగా వినిపిస్తుంటారు. జీవితాలను పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా జనంలో మమేకం అవుతారు. పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయేవారు కొందరైతే.. జైళ్లల్లో మగ్గిపోయేవారు మరికొంతమంది. అలాంటి వారిలో ఒకరైన ఇరాన్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త నర్గీస్ మహ్మదీకీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. 122 ఏళ్ల నోబెల్ చరిత్రలో శాంతి బహుమతి పొందిన 19వ మహిళైన నర్గెస్ ఈ అవార్డు ప్రకటించే సమయానికి శిక్ష అనుభవిస్తూ ఇరాన్ టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో ఉన్నారు.
'నువ్వెప్పుడూ వ్యవస్థతో పోరాడవద్దు. అది నిన్ను కబళించివేస్తుంది. ఇరాన్ వంటి దేశంలో అది నిన్ను మరింత భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది' అని యుక్త వయసులో ఉన్న నర్గీస్‌్‌తో ఆమె తల్లి అనేకసార్లు చెప్పేవారు. నర్గీస్ 30 ఏళ ్ల పోరాట జీవితం చూస్తే ఆ మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తాయి. రచయితగా, మానవ హక్కుల కార్యకర్తగా, డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ (డిహెచ్‌ఆర్‌సి) డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న నర్గీస్ తన పోరాట జీవితంలో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఆమెను 5 సార్లు దోషిగా నిర్ధారించి, 31 ఏళ్ల జైలు శిక్ష వేశారు. 154 కొరడా దెబ్బలు ఆమె శరీరాన్ని ఛేదిస్తూ.. రక్తాన్ని చిందించాయి..

- పోరాటం ఇలా మొదలైంది..
ఇరాన్, ఝంజన్‌లో పుట్టిన నర్గీస్ భౌతికశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. చదువుకునే రోజుల నుండే ప్రజా పోరాటాల్లో చురుకుగా ఉండేవారు. మహిళల హక్కులపై, సమానత్వంపై తన వాదనను బలంగా వినిపించేవారు. ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వివిధ పత్రికలకు సంచలనాత్మక కథనాలు రాసేవారు. స్వేచ్ఛ కోసం చేసిన పోరాట ఫలితంగా 2011లో తొలిసారి అరెస్టయి జైలు కెళ్లారు. జైల్లో అయితే పెట్టారు కానీ ఆమె పోరాట పటిమను నిలువరించలేకపోయారు. ఈసారి ఆమె పోరాటం ఖైదీల కోసం, వారి కుటుంబాలకు కోసం మొదలైంది. ఫలితంగా జైలు శిక్ష పొడిగించారు. 2013లో బెయిల్‌పై బయటికి వచ్చిన ఆమె ఇరాన్‌లో అమలు చేస్తున్న 'మరణశిక్షకు' వ్యతిరేకంగా మరోసారి పోరాడి 2015లో అరెస్టయ్యారు. ఈసారైతే జైల్లోనే మగ్గిపోతున్న రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళా ఖైదీలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడారు. ఇరాన్‌లో మహిళలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న అరాచకాలను తన కలంతో దుయ్యబట్టారు. జైల్లో కూడా తన పోరాటం సాగిస్తున్న నర్గీస్‌పై పాలకులు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. గత 18 నెలలుగా ఆమె తన భర్త, పిల్లలతో నేరుగా మాట్లాడకుండా ఆంక్షలు విధించారు.
గతేడాది శిక్ష మళ్లీ పెంచారు..

బాధిత గొంతుకగా మారిన ఆమె గతేడాది ఇరాన్‌లో పెద్ద ఎత్తున జరిగిన హిజాబ్ పోరాటానికి సంఘీభావంగా నిలిచారు. మద్దతుగా లేఖలు రాశారు. దీనిపై పాలకులు కేవలం ఐదు నిమిషాల విచారణ చేసి 8 ఏళ్లు జైలు, 70 కొరడా దెబ్బల శిక్ష విధించారు.
గతేడాది ఇరాన్‌లో హిజాబ్ ధరించకుండా బయటికి వచ్చిన మాసా అమిని అనే యువతిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. 'దుస్తులు ధరించడం నా ఇష్టం. మీ అనుమతి అవసరం లేద'ని ఆమె కరాఖండిగా చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కస్టడీ సమయంలోనే ఆమె మరణించింది. అప్పుడు ఇరాన్ వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకు జైలు నుండే నర్గీస్‌్ మద్దతును తెలియజేశారు. దీంతో, జైలు అధికారులు ఆమెపై మరిన్ని ఆంక్షలు పెట్టారు. ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఫోను కాల్స్‌కు కూడా ఆస్కారం లేకుండా చేశారు. ఆమె రచనలను ప్రచురణ కాకుండా అడ్డుకున్నారు.

- మత రాజ్యంలో ...
1990 నుంచి పోరాట జీవితంలో మమేకమైన నర్గీస్‌్, గతంలో నోబెల్ శాంతి బహుమతి తీసుకున్న షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (డిహెచ్‌ఆర్‌సి)సెంటర్‌లో 2003లో చేరారు. ఇప్పుడు అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ సంస్థలో చేరినందుకు కూడా ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసింది.

విద్య, న్యాయ వ్యవస్థ, పౌర సమాజాన్ని బలోపేతం చేయడం, మహిళల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటం చేయడంలో ఆమె జీవితాన్నే పణంగా పెట్టారు. భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా ఏళ్లకు ఏళ్లు జైల్లోనే మగ్గిపోతున్నారు. సాహోసపేతమైన పోరాటం చేసేటందుకు తమ వ్యక్తిగత జీవితాల్ని వెచ్చిస్తున్న ఎందరో మహిళలకు నర్గీస్‌్ జీవితం ఉదాహరణగా నిలుస్తుంది.