Oct 26,2022 22:44

సీనియర్‌ హీరో నరసింహరాజును సత్కరిస్తున్న దాసరి అకాడమీ

ప్రజాశక్తి- సీతమ్మధార :కెరీర్‌ ముగిసిపోతున్న తరుణంలో తనకు సినీ జీవితం ప్రసాదించింది దర్శకరత్న దాసరి నారాయణరావు అని సీనియర్‌ సినీ హీరో నరసింహరాజు తెలిపారు. 'అనుకోని ప్రయాణం' సినిమా ప్రివ్యూ సందర్భంగా నగరానికి విచ్చేసిన ఆయనకు, దాసరి నారాయణరావు కల్చరల్‌ అకాడమీ అనుబంధ సంస్థ విశాఖరత్న కళాపరిషత్‌ నేతత్వంలో బుధవారం పౌర గ్రంథాలయంలో దాసరి ఆత్మీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహరాజు ప్రసంగిస్తూ దాసరి దర్శకత్వంలో 'నీడలేని ఆడది' సినిమా ద్వారా హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని, ఆ సినిమా అనేక సెంటర్లలో శతదినోత్సవం జరుపుకున్నప్పటికీ, తనకు రెండేళ్ల వరకు మరో సినిమా అవకాశం రాలేదన్నారు. ఆ తరుణంలో జర్నలిస్టులు రామచందర్రావు, బ్రహ్మానందం తనను దాసరి వద్దకు తీసుకుని వెళ్లి 'తూర్పు పడమర' సినిమా ద్వారా మారో అవకాశం కల్పించి, తద్వారా తన సినీ జీవితానికి పునాది వేశారన్నారు. 1993లో హైదరాబాద్‌ వచ్చిన తర్వాత దాసరి కొన్ని వ్యాపారాలు అప్పజెప్పి తనను ఆర్థికంగా నిలబెట్టారని గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రుల తర్వాత దాసరి నారాయణరావు, దాసరి పద్మ తనకు పెద్దదిక్కులని కొనియాడారు. దాసరి ఆత్మీయ పురస్కారాన్ని ఆయన పేరిట నెలకొల్పిన అకాడమీ అందుకోవడం, భాస్కరరావు తనను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి డాన్స్‌లు, ఫైటింగ్‌ల ద్వారా, రాజేంద్రప్రసాద్‌ కామెడీ ద్వారా ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. ఆ నలుగురు, శ్రేయోభిలాషి సినిమాల తరహాలోనే 'అనుకోని ప్రయాణం' సినిమా ఉంటుందని, ప్రతి ఒక్కరూ పెద్దస్క్రీన్‌పై వీక్షించాలని కోరారు. తాను విశాఖ వాసినని, అత్తింటి వారు గాజువాక, వదిన విశాఖ సిటీలో ఉంటున్నారన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ జానపద చిత్రాల కథానాయకులలో ఎన్టీఆర్‌ తర్వాత నరసింహరాజని, అటువంటి హీరోని సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమంలో సినీ నటులు ప్రసన్న కుమార్‌, అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు పిఏ భాస్కరరావు, నిర్మాత కంచర్ల అచ్యుతరావు, దర్శకులు యాదకుమార్‌, పాల్గొన్నారు.