ప్రజాశక్తి-వన్‌టౌన్: విద్యార్థిని అత్యాచారం కేసులో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్‌రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం డిసిపి డాక్టర్ అజిత వేజెండ్ల విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన యువతి విజయవాడ అంబాపురంలోని ఫణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో 2017 నుండి 2020 సంవత్సరం వరకు జిఎన్‌ఎం నర్సింగ్ కోర్సు చదివింది. ఆ సమయంలో కళాశాల ప్రిన్సిపల్ బసిరెడ్డి రవీందర్‌రెడ్డి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. చదువు పూర్తయినా సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడు సార్లు గర్భ నిరోధక మాత్రలతో గర్భస్రావం చేయించాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యల వల్ల ఆమె స్వగ్రామానికి వ్ళెఇ్లపోయింది. ఈ నెల 5వ తేదీన ప్రిన్సిపల్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మీడియాలో రావడంతో యువతి ఈ నెల 7వ తేదీన విజయవాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టి వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. డిసిపిలు విశాల్ గున్ని, డాక్టర్ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో పశ్చిమ ఎసిపి డాక్టర్ కె.హనుమంతరావు, టూటౌన్ ఇన్స్పెక్టర్ ఎ.సుబ్రహ్మణ్యం కేసును విచారించి నిందితుడు రవీందర్‌రెడ్డిని అరెస్టు చేశారు.










