ప్రజాశక్తి - సాలూరు : ప్రయివేటు నర్సింగ్ హోములున్న డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యశాఖ ఉన్నతాధికారులు ముడుపులు తీసుకుని ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని వందపడకల ఆసుపత్రికి సూపరింటెండెంట్‌గా సీనియర్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌ను నియమించాల్సి ఉంది.ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో ఐదుగురు సీనియర్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌లు పని చేస్తున్నారు. వీరిలో అందరికన్నా సీనియర్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ కొంతకాలం పాటు సూపరింటెండెంట్‌గా పని చేశారు. ఆయన ఈ ఏడాది నవంబర్‌లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత సీనియర్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ రత్నకుమారి ఇప్పుడు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మిగిలిన ముగ్గురు సీనియర్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌ల్లో జూనియర్ అయిన మహిళా డాక్టర్‌ను ఇంఛార్జి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. పట్టణంలో ప్రయివేటు నర్సింగ్ హౌం నడుపుతున్న ఆ మహిళా వైద్యాధికారికి ధర్మాసుపత్రి పగ్గాలు ఎలా అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఆమె భర్త కూడా పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ఆ మహిళా వైద్యాధికారికి సూపరింటెండెంట్ గా బాధ్యతలు ఇప్పించేందుకు ఆమె భర్త తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీకి చెందిన కొందరు అగ్రనాయకుల అండతో పాటు స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి ఆ మహిళా డాక్టర్ భర్త ప్రయత్నాలు సాగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పట్టణ వైసిపి నాయకుల ద్వారా డిప్యూటీ సీఎం రాజన్నదొరపై ఒత్తిడి పెంచేందుకు పైరవీలు మొదలు పెట్టినట్టు సమాచారం .ఇప్పటికే పట్టణంలో ఒక ప్రయివేటు నర్సింగ్ హౌం నడుపుతున్న ఒక ప్రభుత్వ డాక్టర్‌ను మండలంలో ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చాలదన్నట్లు అదే వైద్యాధికారిని ఇన్‌ఛార్జి డిప్యూటీ డిఎంహెచ్‌ఒగా నియమించారు. ప్రయివేటు నర్సింగ్ హోములున్న డాక్టర్లకు ధర్మాసుపత్రుల పగ్గాలు, కీలకమైన అధికారి హౌదా బాధ్యత లు అప్పగించడం వల్ల నిరుపేద రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం లేదు. దీనికి తోడు పలు అక్రమాలకు పాల్పడ్డానికి ఎక్కువ అవకాశాలు వుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లు, లంచాలకు తలొగ్గి ప్రయివేటు నర్సింగ్ హోమ్‌లు నడుపుతున్న డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ధర్మాసుపత్రులకు ఎక్కువగా నిరుపేద, దిగువ మధ్యతరగతి రోగులే ఎక్కువగా వైద్యం కోసం వెళుతుంటారు. ప్రయివేటు నర్సింగ్ హౌం లున్న డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రుల పగ్గాలివ్వడం వల్ల ఆ రోగులను తమ నర్సింగ్ హౌం లకు మళ్లించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కొన్ని జరిగాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన వందపడకల ఆసుపత్రిలో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం రాజన్నదొర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










