Mar 14,2023 23:42

రోడ్డు విస్తరణపై బాధితుల నిరసన

రోడ్డు విస్తరణను 80అడుగులకు పరిమితం చేయాలని డిమాండ్‌
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌
: డివిజన్‌ కేంద్రమైన నర్సీపట్నంలో ప్రధాన రహదారి 100 అడుగులకు చేపడుతున్న నేపథ్యంలో స్థానిక వ్యాపారస్తులు, షాపు యజమానులు స్వచ్ఛంద బంద్‌ను నిర్వహించారు. రోడ్డు విస్తరణను 80 అడుగులకు పరిమితం చేయాలని కోరుతూ ప్లకార్డులతో పట్టణ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించి ఆర్‌డిఒ కార్యాలయానికి చేరుకుని, వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బాధితవ్యాపారస్తులు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటన సందర్భంగా ప్రధాన రహదారిని వంద అడుగుల విస్తరించే పనులకు శంకుస్థాపన చేశారన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు ఇప్పటికే వంద అడుగులు విస్తరించేందుకు మార్కింగ్‌ చేయడంతో తమ దుకాణాలు పోయి, నివాసాలతోపాటు వ్యాపారాలు నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
100 అడుగుల మేర రోడ్డును విస్తరించేందుకు ప్రస్తుతం చేసిన మార్కింగ్‌ను బట్టి ప్రధాన రోడ్డును ఆనుకొని రెండువైపులా ఉన్న భవనాలు, వ్యాపార సంస్థలను దాదాపు పూర్తిగా తొలగించాల్సి ఉంటుందని, అలా జరిగితే చాలా నష్టపోతామని వాపోయారు. రోడ్డు విస్తరణకు 80 అడుగులకు పరిమితం చేస్తే తక్కువ స్థాయిలో భవనాలను తొలగించాల్సి ఉంటుందని వేడుకున్నారు
కట్టడాల నష్టాన్ని తగ్గించేందుకు 80 అడుగులకు పరిమితం చేయాలని, ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు దష్టికి తీసుకెళ్లామని వారంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా ముందుకు సాగడంతో నిరసన వ్యక్తం చేస్తూ స్వచ్ఛంద బంద్‌ పాటిస్తున్నామని వెల్లడించారు. బంద్‌ సందర్భంగా పట్టణంలో ప్రముఖ వ్యాపార సంస్థలైన సిఎమ్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌, సౌత్‌ సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌, మోర్‌ వంటి పలు రకాల వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి. తమకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే బంద్‌ చేస్తున్నామే తప్ప తాము రోడ్డు విస్తరణకు, అభివృద్ధికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వ్యాపారులు, దుకాణ యజమానులు స్పష్టం చేస్తున్నారు.