Feb 05,2023 00:16

ప్రశ్నిస్తున్న సభ్యులుగా సర్వసభ్య సమావేశాలు


ప్రశ్నిస్తున్న సభ్యులుగా సర్వసభ్య సమావేశాలు
ప్రజాశక్తి-నక్కపల్లి:అక్రమ గ్రావెల్‌ తవ్వకాలతో మండలంలోని అధికారులు ఉన్నట్టా లేనట్టా అని చినతీనార్ల ఎంపీటీసీ సభ్యులు వాసుపల్లి అప్పలస్వామి ప్రశ్నించారు.మం
డల పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం ఎంపీడీవో సీతారామరాజు ఆధ్వర్యంలో ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అప్పలస్వామి మాట్లాడుతూ, చినతీనార్లలో తిప్పలవాని చెరువులో అక్రమంగా మట్టి తరలించక పోతున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ ఏఈ లోకేష్‌ మాట్లాడుతూ చెరువును పరిశీలించి ఆధారాలతో రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. చినదొడ్డిగల్లు బద్ది వీధిలో మురుగు నీటి సమస్యకు సంబంధించి అధికారుల ఆదేశాల మేరకు సర్వే చేపట్టడం జరిగిందని, సర్వే రిపోర్టు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని మండల సర్వేయర్‌ మూర్తిని మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వెలగా ఈశ్వరరావు నిలదీసారు. సర్వే రిపోర్టును ఆన్‌ లైన్‌ లో పెట్టాలని డిమాండ్‌ చేశారు.ఈ మేరకు సర్వేయర్‌ మూర్తి మాట్లాడుతూ, సర్వే రిపోర్టును తహసీల్దార్‌ కు అందజేశామని బదులిచ్చారు. పెద్ద తీనార్ల సర్పంచ్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పుంతరోడ్డు ఆక్రమణకు గురి కావడంతో రోడ్డు నిర్మాణం చేపట్టడానికి అవకాశం లేకుండా పోయిందని, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొండవాకలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి కేంద్ర నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు.ఉద్దండపురం సర్పంచ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల ఇబ్బందులను వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆర్‌బికేల ద్వారా ధాన్యం కొనుగోలును ఏప్రిల్‌, మే నెల వరకు పొడిగించాలని కోరారు.పెద తీనార్ల ఎంపీటీసీ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రేషన్‌ బియ్యం వాహనం ద్వారా ఇంటింటికీ సరఫరా చేయాలన్నారు. పెదతీనార్ల తో పాటు దొండవాక కూడా ఒకేసారి జలజీవన్‌ మిషన్‌ పనులు చేపట్టాలని కోరారు.
డొంకాడ సర్పంచ్‌ అల్లు పార్వతి మాట్లాడుతూ జలజీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేయాలని కోరారు.డిఎల్‌ పురం ఎంపీటీసీ సభ్యులు కొండ్ర కనకారావు మాట్లాడుతూ గ్రామంలో పలువురు బతికుండగానే మృతి చెందారని రేషన్‌ కార్డుల్లో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వీసం నానాజీ మాట్లాడుతూ,సభ్యులు లేవనెత్తిన సమస్య లను అధికారులు సకాలంలో పరిష్కరించాలన్నారు.
వాడి వేడిగా సమావేశం
కోటవురట్ల:మండల సమావేశం మందిరంలో శనివారం ఎంపీపీ అప్పలనాయుడు అధ్యక్షతన జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశం వాడి వేడిగానే జరిగింది. సమావేశం ప్రారంభంలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు హాజరు రిజిస్టర్‌ పై సంతకం పెట్టక పోవడంతో వైస్‌ ఎంపీపీ దత్తుడురాజు సంతకం చేయకపోతే బయటికి వెళ్లి పోవాలనడంతో ఒకసారిగా ఆ పార్టీ సభ్యులు పోడియం దగ్గరికి వెళ్లి సభాధ్యక్షులను నిలదీశారు.సంతకం సభ పూర్తి అయిన తర్వాత కూడా పెట్టవచ్చునని అనడంతో ఇరువర్గాల మధ్య కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం సభ ప్రారంభంలో ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ అధికారి నిర్లక్ష్యం పట్ల అధికార ప్రతిపక్ష నాయకులు అసహనం వ్యక్తం చేశారు. మండలంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలు పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని రాజుపేట సర్పంచ్‌ వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొడవటిపూడి గ్రామ సర్పంచ్‌ అప్పారావు కాలనీ వద్ద నీటి సౌకర్యం లేకున్నా పట్టించుకోలేదని, కోదండరాం పురానికి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోయిందని సబ్యులు అన్నారు. నీలిగుంట గ్రామ సర్పంచ్‌ వరహాల బాబు మాట్లాడుతూ, 104 వాహనం గ్రామంలోకి గతంలో వచ్చేదని, ప్రస్తుతం బోడపాలెం సచివాలయంలో ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపీపీ సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్‌, తహసిల్దార్‌ జానకమ్మ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.