Jul 28,2023 20:53

గోడ పత్రికలో విడుదల చేస్తున్న నాయకులు

నరేంద్ర మోడీ పాలన నుండి రైతు శ్రామికులను కాపాడాలి
ప్రజాశక్తి - మిడుతూరు

మోడీ పాలన నుండి రైతులను, శ్రామికులను కాపాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి టి ఓబులేష్‌లు పేర్కొన్నారు. శుక్రవారం గోడ పత్రిక ను స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతాంగానికి తీవ్రమైన హాని కలిగించే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, ఎలక్ట్రికల్‌ బిల్లు 2020 రద్దు చేయాలని, పంటలన్నింటికీ డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసే విధంగా సమగ్ర పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి సి ప్లస్‌ టు 50 శాతం చట్టబద్ధత ఎంఎస్పి నిర్ణయించబడాలని, రైతులకు ఒక పర్యాయం పంట రుణాలు మాఫీ చేయాలని అన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలని కేరళ తరహా రైతు ఉపశమన చట్టం పార్లమెంటులో ఆమోదించి రైతుల కౌలు రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని కోరారు. నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని ఎత్తిపోతల పథకాలకు రైతులకు నీరు అందే విధంగా నిధులు కేటాయించాలన్నారు. అదేవిధంగా మిడుతూరు మండలంలో హంద్రీనీవా, సుజల స్రవంతి ద్వారా ఎత్తిపోతల పథకం మంజూరు చేసి మెట్ట రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై ఈనెల 30వ తేదీన విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే కిసాన్‌ మోర్చా కార్మిక కర్షక సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు మానికింది హరి నాయుడు, కార్యదర్శి ఎం శేఖర్‌, రైతు నాయకులు కె శివ రాముడు, జయ రాముడు, మద్దిలేటి, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు టౌన్‌ : రైతులకు కనీసం మద్దతు ధరను చట్టబద్ధం చేయాలి, విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని రద్దు, రైతులకు రుణమాఫీ, తదితర సమస్యల పరిష్కారానికై ఈనెల 30వ తేదీన విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరుగు కార్మిక, కర్షక రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఫకీర్‌ సాహెబ్‌, సిఐటియు జిల్లా నాయకులు టి గోపాలకృష్ణ కోరారు. అనంతరం సదస్సుకు సంబంధించిన గోడపత్రికలను పట్టణంలోని పలు ప్రాంతాలలో అతికించారు. ఈ కార్యక్రమంలో వడ్డే రాజు సాజిద్‌ పాల్గొన్నారు.