Dec 19,2021 12:32

ఇక్కడ కుమ్మరోడికి కుండ కరువు
నేతగాడికి గుడ్డ దొరకదు
మట్టి పిసికి
గరిసెలు నింపే సేద్యగాడింట్లో
అన్నం నిండుకుంటది
కాటికాపరికి
బొందల గడ్డలో
ఆరడుగుల నేల పుట్టదు...
చచ్చినాక బ్రాహ్మడైనా చండాలుడైనా
ఒక్కటే అన్నావు అన్నమయ్యా!
మేము చచ్చినా
పూడ్చుకోడానికి
కాసింత జాగా దొరకదని
ఎన్నిసార్లు రుజువయ్యిందో చూశావా!
బతికినన్నాళ్లూ
కర్ర బుచ్చుకుని తరిమే కులం
చావులోనూ
మనిషిని కుళ్లబొడుస్తుంది
బడిలో, గుడిలో,
నీటిలో, తిండిలో,
ఆఖరుకి కాటిలో
నీడలా వెంటాడే సైతాన్‌ కులం...
ఇక్కడి నేలకీ కులముంది
కులమున్నోడికే భూమి
కులం తక్కువోడు
భూమి కావాలన్నప్పుడల్లా
'నరబలి' కోరుతుంది కులం...
కులం నాలిక మచ్చలమారిది
కానీ, నేల అబద్ధమాడదు
పత్రాలతో దస్త్రాలతో
దానికి పనిలేదు...
ఏ శవం కార్చిన
చెమట బొక్కెనలతో
తాను తడిసి ముద్దయ్యిందో
ఎవరి చేతిలో చదునై
తను పంటయ్యిందో
మట్టికి తెలుసు...
ఎవరు తనని వొంటికి పులుముకుందీ
ఏ మట్టి బిడ్డలు
తన వీపు మీద అంబాడిందీ
తనకి గుర్తే...
చెరబట్టేవాడెవడైనా
తనని ముద్దాడే
మట్టి పెదాల స్పర్శ
ఈ మన్నుకి ఎరుకే...
మట్టి తల్లి ఓరిమికీ ఓ హద్దుంటది
తనని పెనవేసుకున్న మనిషికి
నేలమాళిగలో
ఆరడుగుల చోటియ్యని కట్టడిని
నేల ఎప్పటికైనా
బలికోరక తప్పదు...
 

చల్లపల్లి స్వరూపరాణి
94403 62433