- నోట్ల మార్పిడి వ్యవహారంలో రౌడీషీటరే ప్రధాన సూత్రధారి
- పోలీసుల అదుపులో ఎనిమిది మంది నిందితులు
- పరారీలో ఒకరు
ప్రజాశక్తి - పలాస: రూ.రెండు వేల నోట్ల మార్పిడి కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో స్థానికులు ముగ్గురు సూత్రధారులుగా నిన్నటి వరకు భావించగా, రౌడీషీటర్ సంతోష్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంతోష్ విలాసాలకు అలవాటు పడి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. కాశీబుగ్గకు చెందిన ఈయన విశాఖపట్నంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. సంతోష్‌కు ఈ ప్రాంత రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి కోల్‌కతా వరకు రౌడీషీటర్‌కు నేరగాళ్లతో పరిచయాలు ఉన్నాయి. సంతోష్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులున్నట్లు తెలుస్తోంది. బంగారు వర్తకులు, బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సంతోష్ పధకం రూపొందించి తన ప్రధాన అనుచరులతో పని కానిస్తాడు. ముందుగా డీల్ కుదుర్చుకొని వారి డబ్బుతో తాము చెప్పిన చోటుకు వచ్చిన తర్వాత డబ్బుతో ఉడాయించే విధంగా స్కెచ్ వేస్తాడు. ఇటువంటి ఘటనే తాజాగా నోట్ల మార్పిడి వ్యవహారంలో జరిగింది. ఇటువంటి కార్యకలాపాల కేసుల్లో ఇరుక్కుని జైలుపాలై, తిరిగి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. డబ్బులు సులువుగా సంపాదించాలి, విలాసవంతంగా జీవితం గడపాలనే వ్యక్తులను తన వద్దకు చేర్చుకుని వారి అవసరాలకు, జల్సాలకు డబ్బులు అందించి ఇటువంటి నేరాలు చేయడానికి వారిని ఉపయోగించుకుంటాడు. తాను తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తాడు. నోట్ల మార్పిడి ఘటనలో పలాసకు చెందిన కొంతమందిని భాగస్వామ్యులు చేసినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది..?
ఇటీవల నరసన్నపేటకు చెందిన ఒక వ్యాపారికి పలాసకు చెందిన ఒక బ్యాంకు మేనేజర్ మధ్యవర్తిత్వం వ్యవహరించి రూ.50 లక్షల రూ.500 నోట్లు ఇస్తే, రూ.కోటి వరకు రూ.రెండు వేల నోట్లు ఇస్తామని నమ్మబలికాడు. నోట్ల మార్పిడికి పలాస జూనియర్ కళాశాల సమీప ప్రాంతంలో అడ్డాగా చేసుకుని అక్కడకు తీసుకురావాలని చెప్పాడు. నరసన్నపేటకు చెందిన సదరు వ్యాపారి రూ.500 నోట్లు రూ.50 లక్షలకు తీసుకురాగా, వాటిని పరిశీలిస్తున్న క్రమంలో సదరు వ్యక్తులు రూ.రెండు వేల నోట్లు ఇవ్వకుండా కాలయాపన చేశారు. అదే సమయంలో సినీఫక్కీలో పోలీస్ సైరన్ వేసుకుంటూ వచ్చి రూ.50 లక్షలతో ఉడాయించారు. దీంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేసు నమోదులో తాత్సారంతో ఆ పంచాయితీ ఎస్‌పి వద్దకు చేరింది. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు?, వారెవరు?, పోలీసులు కేసు నమోదులో ఎందుకు తాత్సారం చేశారనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
పోలీసుల అదుపులో ఎనిమిది మంది నిందితులు
ఈ కేసులో కాశీబుగ్గ పొలీసులతో పాటు ఎస్‌పి జి.ఆర్ రాధిక ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీసులూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే కాశీబుగ్గ పొలీసులు ఎనిమిది మందిని అదుపులోని తీసుకోగా, ఒకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా, కేసు నమోదుపై తాత్సారంలో కాశీబుగ్గ పోలీసులు చెప్తున్న వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. నరసన్నపేటకు చెందిన వ్యాపారి పోలీసులు ఫిర్యాదు చేసి కేసు వద్దని, డబ్బులు ఇప్పిస్తే చాలని అన్నారని కాశీబుగ్గ సిఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. పెద్ద నేరం కాబట్టి డిఎస్‌పి దృష్టిలో పెట్టాలని ఎఫ్‌ఐఆర్‌పై సంతకం చేయాలని చెప్పామన్నారు. ఎటువంటి కేసు వద్దని రాతపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. కేసు ఛేదించే క్రమంలో దర్యాప్తు కోసం నరసన్నపేట వెళ్లి వ్యాపారికి వివరాలు అడిగినా వివరాలు అందించడం లేదన్నారు. అందువల్లే కేసు నమోదులో జాప్యమవుతోందని చెప్పారు. అయినా నాలుగైదు రోజుల్లో కేసును ఛేదిస్తామన్నారు. అయితే అదే వ్యాపారి తాను ఫిర్యాదు చేసినా కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. ఎస్‌పి జోక్యంతో కేసు విచారణ చకచకా సాగుతోంది.










