సిపిఎం ఆధ్వర్యంలో గెడ్డప్రాంత నివాసితుల ధర్నా
ప్రజాశక్తి- పెందుర్తి : గెడ్డ ప్రాంతాల్లో నివాసితుల ఇళ్ల తొలగిపోవాలంటూ అధికారుల జారీ చేసిన నోటీసులను వెంటను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా శుక్రవారం నిర్వహించారు..ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యవర్గసభ్యులు జగన్ మాట్లాడుతూ మండలంలో 416ఇళ్లకు తాజాగా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. దాదాపు 20ఏళ్లుగా నివాసముంటూ, విద్యుత్, జివిఎంసి, ఇంటి పన్నులు కూడా చెల్లిస్తున్న వీరందరికీ ఇపుడు సుప్రీంకోర్టు ఆదేశాలంటూ తహశీల్దార్ నోటీసులు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో కోర్టు ఆదేశాలను ఎన్ని అమలు చేశారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. ఒకవైపు జగనన్న కాలనీలు, ఇళ్లు అంటూ పేదలకు సొంతింటి సౌకర్యం కల్పిస్తున్న పరిస్థితుల్లో, నివాసముంటున్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబని, వెంటనే వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు
సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, పేదల ఇళ్లను పీకేయాలన్న అధికారుల చర్యలను స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఇళ్ల కోల్పోతున్న నివాసితులు ఆందోళన చేస్తుంటే ఎన్నికల కోడ్ అంటూ అడ్డుకుంటున్న పోలీసులకు, ఇదే సమయంలో పేదలకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను వెనక్కు తీసుకోకుంటే రానున్న రోజుల్లో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మహిళా సంఘం నేత బి.అనంతలక్ష్మి సిఐటియు నేత అప్పలనాయుడు, అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.










