Mar 19,2023 23:41
మార్టూరులో పోలీసుల అదుపులో టిడిపి నాయకులు

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: జిఒ 1ని రద్దు చేయాలని కోరుతూ చలో అసెంబ్లీకి వెళ్లొద్దని పేర్కొంటూ టిడిపి నాయకులను నోటీసులు అందిస్తామని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించిన మార్టూరు ఎస్‌ఐ కోడూరు కమలాకర్‌ నిర్బంధించడం దారుణమని టిడిపి బిసి సెల్‌ పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులు శివరాత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్టూరు టిడిపి నాయకులైన కామేపల్లి హరిబాబు, తాటి నాగేశ్వరరావును ఎస్‌ఐ నోటీసులు తీసుకెళ్లండంటూ స్టేషన్‌కు పిలిపించి నిర్బంధిం చడం అన్యాయమన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తేనే వదిలిపెడతామనడం దారుణమన్నారు.
పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం
జివో 1ని నిరసిస్తూ విజయవాడ వెళ్లకుండా నిర్బంధించిన టిడిపి నాయకులను విడుదల చేయాలని కోరుతూ టిడిపి శ్రేణులు మార్టూరు పోలీసు స్టేషన్‌ వద్దకు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ నాయకులను నిర్బంధం నుంచి విడుదల చేయాలని జనం కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి 9గంటల వరకు కూడా పోలీసులు వారిని స్టేషన్‌ నుంచి వదలలేదు.
చెరుకుపల్లి: జీవో నెంబర్‌ ఒకటిని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 20వ తేదీన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమా నికి వెళ్లవద్దని ఎస్‌ఐ డి వెంకట కొండారెడ్డి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదివారం నోటీసులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెరుకుపల్లి ఎస్‌ఐ డి వెంకట కొండారెడ్డి నోటీసులు అందజేశారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి ఇవ్వలేదని, ఎవరూ పాల్గొనవద్దని మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులకు మొత్తం 149 నోటీసులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లాది రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నాగుల పున్నారావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఉప్పాల సాంబశివరావు, ఆప్కో మాజీ డైరెక్టర్‌ దివి రాంబాబు, మాజీ జెడ్పిటిసి సభ్యులు పిట్టు శ్రీనివాసరెడ్డి తదితరులకు నోటీసులు అందజేశారు.