Aug 10,2022 23:31

ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం

ప్రజాశక్తి-సీతమ్మధార: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ఉంచాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ కేసలి అప్పారావు నేతృత్వంలో ఆదేశాలు జారీచేయనున్నట్టు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. బుధవారం విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎ.సత్యనారాయణ, విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మణరావు నేతృత్వంలో వివిధ విభాగాల అధికారులతో సీతమ్మధారలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ హైస్కూలును సందర్శించారు. అక్కడి ప్రిన్సిపల్స్‌ విజరు, మనోజ్‌లతోనూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణకు పాఠశాల యాజమాన్యం చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి మెట్రోపోలిటన్‌ నగరాల్లో ఉన్న అన్ని ప్రయివేటు, కార్పొరేటు పాఠశాలల నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలు పెట్టేలా కమిషన్‌ చేపడుతున్న చర్యలకు ఇటు బాలల సమాజం, అటు ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంజిత్‌ రెడ్డి, ఎంఎస్‌కె.రజని, తల్లిదండ్రుల సంఘాల ప్రతినిధులు శకుంతల, ఎల్లయ్య, శేఖర్‌, డాక్టర్‌ జగ్గారావు, త్రిమూర్తులు, హరీష్‌, చినతల్లి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.