Jul 30,2023 23:51

అవగాహన కల్పిస్తున్న గీతం దంత కళాశాల విద్యార్థులు

ప్రజాశక్తి-మధురవాడ : నోటి ఆరోగ్యంపై ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా గీతం దంత వైద్యకళాశాల ఆసుపత్రి ఆధ్వర్యాన ఆర్‌కె.బీచ్‌లో ఆదివారం చైతన్య నడక, ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. ఆగస్టు 1న జాతీయ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గీతం దంత కళాశాల పెరియోడాంటిక్స్‌ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వై.రవిశంకర్‌ మాట్లాడుతూ, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా శరీరాన్ని చాలా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. పొగాకు సంబంధ ఉత్పత్తుల నుంచి దూరంగా ఉండటం, దంత సంరక్షణ, తరచూ బ్రష్‌లను మార్చడం, తీయటి పదార్థాలను తగ్గించుకోవడం, తాజా పళ్ళను స్వీకరించడం, దంత వైద్యులను సంప్రదించడం చేయాలని సూచించారు. దంత విద్యార్థులు నోటి ఆరోగ్యంపై బ్యానర్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్‌ వై.త్రినాధ్‌కిషోర్‌, ఇతర దంత వైద్యులు పాల్గొన్నారు. దాదాపు 100 మంది దంత వైద్య విద్యార్థులు బీచ్‌ రోడ్డులో వాకర్స్‌తో పాటు సాధారణ ప్రజలకు నోటి ఆరోగ్య ప్రాధాన్యతను తెలిపే డిజిటల్‌ సమాచారం ప్రదర్శించారు.