Apr 18,2021 14:53

                                                            జొన్న పిండి

జొన్న పిండి

కావాల్సిన పదార్థాలు : జొన్నపిండి - కప్పు, నీళ్లు - ఐదు కప్పులు, కారం - అర స్పూన్‌, ఉప్పు - సరిపడా, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం : ముందుగా జొన్నపిండిలో రెండు కప్పుల నీళ్లు కలిపి, పలచగా చేసుకోవాలి.
- తర్వాత మిగిలిన నీటిని స్టౌపై గిన్నెలో మరిగించుకోవాలి.
- అందులో ముందుగా ఉప్పు, కారం వేయాలి. తర్వాత కలిపి పెట్టుకున్న జొన్నపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
- బాగా ఉడికిన తరువాత ఇంగువ కలపాలి.
- ఆ మిశ్రమం బాగా చల్లారిన తరువాత ఒక ప్లాస్టిక్‌ షీటుపై స్పూన్‌తో పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా వడియాలు పెట్టాలి.
- వాటిని బాగా ఎండబెట్టుకోవాలి.
- వడియాలు బాగా ఎండిన తరువాత డబ్బాల్లో భద్రపరచుకోవాలి.

                                                               క్యారెట్‌

క్యారెట్‌

కావాల్సిన పదార్థాలు : క్యారెట్‌- అరకేజీ, సగ్గుబియ్యం- నాలుగు కప్పులు, గసగసాలు- రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, పచ్చిమిర్చి- పది, ఉప్పు- సరిపడా.
తయారుచేసే విధానం : సగ్గుబియ్యాన్ని రెండుగంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో పదిహేను గ్లాసుల నీళ్లు పోసి గ్యాస్‌ స్టౌమీద పెట్టాలి.
- అలానే క్యారెట్లను శుభ్రం చేసి, చెక్కు తీసి తురమాలి.
- సగ్గుబియ్యం సగం ఉడికాక, అందులో క్యారెట్‌ తురుము వేయాలి.
- తర్వాత కొత్తిమీర, గసగసాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీలో ముద్దలా చేసుకుని, ఉడుకుతున్న పిండిలో వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత దింపేయాలి.
- అది చల్లారిన తర్వాత గరిటెతో వడియాల్లా పెట్టుకుంటే చాలు.

                                                                 టమాటా

టమాటా

కావాల్సిన పదార్థాలు : టమాటాలు - కిలో, సగ్గుబియ్యం - కప్పు, అటుకులు - కప్పు, పచ్చిమిరపకాయలు - పది, జీలకర్ర - మూడు చెంచాలు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం : ముందుగా టమాటాలు చిన్న ముక్కలుగా కోయాలి.
- తర్వాత సగ్గుబియ్యం, టమాటాలు, అటుకులు అన్నీ కలిపి అరగంటసేపు నానబెట్టుకోవాలి.
- పచ్చిమిర్చిలో ఉప్పు వేసి, మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని నానబెట్టిన అటుకులు, టమాటాలు, తగినంత ఉప్పు వేసి, మరోసారి గ్రైండ్‌ చేయాలి. కానీ మరీ పలుచగా ఉండకూడదు.
- ఇంకా అందులో జీలకర్ర వేసి, చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవాలి.
- పూర్తిగా ఎండిన తరువాత, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

                                                              మెంతికూర

 మెంతికూర

కావాల్సిన పదార్థాలు : మినప్పప్పు- రెండు కప్పులు, మెంతి ఆకులు- ఎనిమిది కప్పులు, జీలకర్ర- రెండు చెంచాలు, ఉప్పు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- పన్నెండు కాయలు (మొత్తగా రుబ్బుకోవాలి), అల్లం తరుగు- నాలుగు చెంచాలు.
తయారుచేసే విధానం : ముందురోజు రాత్రి మినప్పప్పును నానబెట్టుకోవాలి.
- మర్నాడు పప్పుని కడిగి, మెత్తగా రుబ్బుకోవాలి.
- అందులో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి, కలపాలి.
- కాసేపయ్యాక పల్చని తడివస్త్రం మీద చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలి. బాగా ఎండనివ్వాలి. లేకపోతే పురుగు పడతాయి.