ఎన్ని రకాల కూరలతో అన్నం తిన్నా.. ఒక ముద్ద రోటి పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అందుకేనేమో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ రోటి పచ్చళ్లను ఇష్టపడతారు. పది నిమిషాల్లోనే తయారుచేసుకునే నోరూరించే రోటిపచ్చళ్లు మీకోసం...
వాక్కాయలు - కొబ్బరి..
కావాల్సిన పదార్థాలు : వాక్కాయలు - పావుకిలో, పెద్దసైజు పచ్చి కొబ్బరికాయ- 1, పచ్చిమిర్చి- 50 గ్రాములు, ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి- తగినంత, పోపు దినుసులు- సరిపడా, నూనె- 4 టేబుల్ స్పూన్లు, చింతపండు- కొంచెం.
తయారుచేసే విధానం:
* ముందుగా పచ్చికొబ్బరిని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
* వాక్కాయలను శుభ్రంగా నీటితో కడిగి, గుడ్డతో తుడవాలి. చిన్న చాకు లేదా పిన్నీసుతో వాటిని నిలువునా చీల్చాలి.
* తర్వాత లోపలి గింజను తీసివేసి, ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
* వాక్కాయ ముక్కల్నీ, పచ్చిమిర్చినీ రెండు టేబుల్ స్పూన్ల నూనెలో దోరగా వేగించాలి.
* వాటికి పచ్చికొబ్బరి ముక్కలు చేర్చి, రోటిలో నూరుకోవాలి.
* కొబ్బరి బాగా నలిగాక ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి వేసి, అతి తక్కువ మోతాదులో చింతపండు కూడా కలిపి తిరిగి రోటిలో నూరాలి.
* తరువాత పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి, అది కాగిన తర్వాత పోపు దినుసులు వేసి, దోరగా వేగనివ్వాలి.
* అందులో నూరి పెట్టుకున్న పచ్చడి ముద్దను వేసి, సన్నటి సెగపై కాసేపు మగ్గనిచ్చి దించేయాలి.
* చల్లారిన తరువాత వడ్డించుకుని తింటే, ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది.
బెండకాయ..
కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు - 250 గ్రా, ఖర్జూరం పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు- అరకప్పు, వేగించిన వేరుశనగ పప్పులు- అరకప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు- అరకప్పు, కొత్తిమీర- అరకప్పు, కరివేపాకు- కొద్దిగా, జీలకర్ర- టీ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, పసుపు- కొద్దిగా, మీగడ- కొంచెం.
తయారుచేసే విధానం:
* ముందుగా స్టౌ మీద నాన్‌స్టిక్ పాత్ర పెట్టి, తక్కువ మంటలో ఐదు నిమిషాలు బెండకాయ ముక్కలని ఉడికించి, పక్కన పెట్టుకోవాలి (ఉడికిస్తే పచ్చివాసన పోతుంది).
* తర్వాత పచ్చి మిరపకాయ ముక్కలు, చింతపండు గుజ్జు వేసి, ఉడికించుకోవాలి.
* ఉడికించిన వాటితోపాటు వేగించిన కొన్ని వేరుశనగ పప్పులు, కొత్తిమీరను రోటిలో వేసి నూరుకోవాలి.
* అందులోనే ఉడికించిన బెండకాయ ముక్కలు, ఖర్జూరం పేస్ట్ వేసి, కచ్చాపచ్చాగా నూరుకోవాలి.
* తర్వాత మిగిలిన వేరుశనగ పప్పులు కలుపుకొని, పక్కన పెట్టుకోవాలి.
* తక్కువ మంటలో స్టౌ మీద నాన్‌స్టిక్ పాత్ర పెట్టి, అందులో మీగడ, ఆవాలు, జీలకర్ర వేసి వేగించుకోవాలి. దానికి కరివేపాకు కలుపుకుంటే తాలింపు రెడీ అవుతుంది.
* తయారుచేసుకున్న తాలింపుని పచ్చడిలో కలిపితే టేస్టీ బెండకాయ రోటి పచ్చడి సిద్ధం.
వంకాయ..
కావాల్సిన పదార్ధాలు : వంకాయలు - 250 గ్రా, పచ్చిమిర్చి - 12, ఉల్లిగడ్డ - ఒకటి, నూనె - తగినంత, అల్లంముక్క - చిన్నది, వెల్లుల్లి రెబ్బలు - 6 లేదా 7, జీలకర్ర - అరస్పూన్, పసుపు - చిటికెడు, శనగపప్పు - అరస్పూన్, మినపప్పు - అరస్పూన్, ఆవాలు- అరస్పూన్, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండుమిర్చి- రెండు, చింతపండు- నిమ్మపండు సైజు.
తయారుచేసే విధానం:
* ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, వాటికి నూనె రాసుకోవాలి (నూనె రాసిన వంకాయలను కాల్చడం వల్ల మెత్తగా మగ్గుతాయి. అలాగే పొట్టు కూడా సులువుగా వచ్చేస్తుంది).
* ఇప్పుడు స్టౌ ఆన్ చేసి, దాని మీద స్టాండ్ పెట్టుకుని ఎక్కువ మంట మీద వంకాయలను కాల్చుకోవాలి.
* అవి కాలేందుకు కొంచెం సమయం పడుతుంది.
* ఎక్కువ మంట మీద కాలుస్తున్నాము కాబట్టి వంకాయలను అటూఇటూ తిప్పుతూ బాగా కాల్చాలి.
* కాలిన వంకాయలను ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె పోయాలి.
* నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలను వేయాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, అల్లంముక్క వేసి బాగా వేగనివ్వాలి.
* ఇంకా కరివేపాకు, చింతపండు వేసుకోవాలి. వాటన్నింటినీ బాగా వేగనివ్వాలి. తర్వాత పాన్ దించి, వాటిని చల్లారనివ్వాలి.
* ఇప్పుడు చల్లారిన వంకాయల పైపొట్టు, తొడిమెలను తీసివేయాలి.
* వేగించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలను రోటిలో వేసి నూరాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి.
* తర్వాత అందులోనే వంకాయలను వేసి, కచ్చాపచ్చాగా నూరుకోవాలి.
* అలా నూరుకున్న పచ్చడిని పక్కన పెట్టుకోవాలి.
* స్టౌ మీద పాన్‌లో పోపు వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. స్టౌ ఆపేసి అందులో కచ్చాపచ్చాగా నూరిన పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. అంతే నోరూరించే వంకాయ రోటిపచ్చడి రెడీ.