
ప్రజాశక్తి - చీరాల
దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆమంచి స్వాములు మాట్లాడిన తీరు ఉందని మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జి, గుంటూరు మాధవరావు, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బొనిగల జైసన్‌బాబు అన్నారు. స్థానిక ఆర్ అండ్‌బి అతిధి గృహంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా చేసేదెవరో ప్రజలకు తెలుసని అన్నారు. ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి, వెంకటేష్‌లపై ఆరోపణలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. టిడిపి, జనసేన సమావేశంలో కొండయ్య, ఆమంచి స్వాములు వ్యాఖ్యలను ఖండించారు. గడిచిన నాలుగేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ఇసుక దందాకు పాల్పడి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లకు వేల లారీలు ఇసుక తరలించి కోట్లు దండుకున్న మీరు నేడు నీతులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రభుత్వ నిధులలో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని అన్నారు. 2014, 2019 ఎన్నికలలో నియోజకవర్గ పరిస్థితులు గమనించిన ప్రజలు తరిమి కొడితే పర్చూరు వెళ్లారని అన్నారు. అక్కడ నుండి గిద్దలూరు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు వైసిపిలో ఉన్న అన్నదమ్ములు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దండిగా సంపాదించారని అన్నారు. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్దమేనా అని ప్రశ్నించారు. రానున్న 2024 ఎన్నికలలో 20వేల మెజారిటీతో వెంకటేష్‌ను గెలిపించుకొని సీఎం జగనన్నకు కానుకగా ఇస్తామని అన్నారు. చీరాలలో టిడిపి, జనసేన అపవిత్ర పొత్తని అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, వేటపాలెం మండలం వైసిపి అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, రామన్నపేట సర్పంచ్ కందేటి రమణ, వైసిపి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సల్లూరి అనిల్, ఆర్బికె చైర్మన్ కావూరి రమణరెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్స్ బత్తుల అనిల్, మల్లెల లలిత రాజశేఖర్, పొత్తూరి సుబయ్య, కలవకూరి యానాదిరావు, షేక్ సుభానీ, యాతం మేరిబాబు, కోలా శివ, కోడూరి ప్రసాదరెడ్డి, శిఖాకొల్లి వెంకటేశ్వర్లు, మామిడాల రాములు, చిలుకోటీ శ్రీను, తలకాయల సుధీర్, వాసిమల్ల వాసు పాల్గొన్నారు.