తన కళ్లలో నను నింపుకొని
ప్రపంచాన్ని పరిచయం చేశాడు
తన గుండెలో నను దాచుకొని
ప్రేమ పువ్వులు మొలిపించాడు
వేలుపట్టి నడిపించి
బతుకు దిశలను చూపించాడు
తన భుజాలపై ఎత్తుకొని
విశాలమైన విశ్వాన్ని ఎరుకచేశాడు
జీవితమనే సాగరంలో
సంసారమనే నావను నడిపి ఒడ్డుకు చేరుస్తాడు
అమావాస్య చీకట్లను ఎదలో నింపుకొని..
పున్నమి వెలుగులను పరివారానికి పంచుతాడు
దించలేని బారాలెన్నింటినో శిరంపై మోస్తూ..
కన్నవారి కోసం కష్టపడతాడు
తన అరచెయ్యి ఎప్పుడూ
పిల్లల తలపై గొడుగై పరుచుకుంటుంది
నుదుట రాసిన రాతలు వెక్కిరిస్తున్నా..
కన్నవారి తలరాతలను మార్చడానికి
స్వేదపు చుక్కలను దారపోస్తాడు
నదిలా పారుతుంటాడు
తన గొంతును తాను తడుపుకోడు
మొక్కై మొలిచి నీడను పూయిస్తాడు
తను మాత్రం కష్టాల ఎండలో చిక్కుకొని చింతిస్తాడు
కన్నవారి కళలన్నింటినీ తన గుండెలో పోగేసుకొని
కన్నీటిపై ప్రయాణం చేస్తాడు
గూడులో దాచుకున్న పిల్లల కూడుకోసం..
మౌనందాల్చిన పక్షిలా రెక్కలను ఎగురేసుకొని..
కాలంతో యుద్ధం చేస్తాడు
పేదరికం గాయమై వెంటాడుతుంటే..
ధైర్యమనే టాబ్లెట్‌తో బదులిస్తాడు
ఎదలో తిష్టవేసి కూసున్న బాధల అలజడులకు
చెమటచుక్కల టానిక్ ఇచ్చి అదుపుచేస్తాడు
కాలం కదులుతూ నిశీధిలోకి బతుకును నెట్టేస్తుంటే..
రంకెలేస్తున్న కాలంపై ఎక్కి గుర్రపు స్వారీ చేస్తాడు
ఊపిరున్నంత వరకూ నెత్తుటి సత్తువతో
బతుకు పడవను నెట్టుకొస్తాడు
- అశోక్ గోనె
94413 17361