Jul 23,2021 15:31

చండీఘర్‌ : పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దు నూతన ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. శుక్రవారం పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేశారు. ప్రేక్షకుల హర్షధ్వానాలు, అరుపుల మధ్య ఈ వేడుక సాగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు. దీంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో చెలరేగిన అసమ్మతి గళానికి తెరపడినట్లయింది. ఈ సందర్భంగా సిద్దు ప్రసంగించారు. సిద్దు ప్రసంగమంతా అక్కడి వ్యవహారాల నిర్వహణ పట్ల ఆయన అనుసరించిన విధానాన్ని సూచించింది. 'నేను మీతో కలిసి పనిచేస్తాను. నాకు ఇగో లేదు. ప్రతిపక్షాల చెబుతున్న దానికి విరుద్ధంగా కాంగ్రెస్‌ ఐక్యంగా ఉంది' అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో తాను అసమ్మతి తెలియజేసిన ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ గురించి వ్యాఖ్యానిస్తూ... తనను వ్యతిరేకించే వారే.. మెరుగుపరుస్తారంటూ పేరు ప్రస్తావించకుండా అన్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అసమ్మతి రాజ్యమేలుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా సిద్దును కలిసేందుకు అమరీందర్‌ సింగ్‌ నిరాకరించారు.
ఈ కార్యక్రమానికి ముందు చండీఘర్‌లోని పంజాబ్‌ భవన్‌లో అమరీందర్‌ సింగ్‌, సిద్దు టీ పార్టీ వేడుకకు హాజరయ్యారు. దీంతో వీరి మధ్య అసంతృప్తి తగ్గిందని తెలుస్తోంది. కాగా, సిద్దు ప్రసంగంలో రాష్ట్రమంతా వెనుకబడి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. మా మధ్య పోరు సమస్య కాదని, ఢిల్లీలో కూర్చున్న రైతులు, వైద్యులు, నర్సుల సమస్యలు నిజమైనవని అన్నారు. ఎక్కువగా మాట్లాడకండి... కానీ టపాసులా మాట్లాడాలి' అని పంజాబీలో వ్యాఖ్యానించారు.