Aug 27,2023 21:11

ఎండిపోయిన మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలి
- గడపగడప కాదు.. పొలం పొలం కార్యక్రమాలు చేపట్టాలి
- రైతులకు పంట నష్టపరిహారం, బీమా అందజేయాలి
- రబీకి విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి
- ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజశేఖర్‌
ప్రజాశక్తి - పాములపాడు

     నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించి ప్రభుత్వం నష్టపరిహార చర్యలను తక్షణమే చేపట్టాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎ.రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం తొలకరిలో వారం పది రోజులు వర్షాలు అధికంగా కురిసినప్పటికీ అ తర్వాత నుండి నేటి వరకు వర్షం కురవకపోవడంతో రైతులు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. మొక్కజొన్నకు దాదాపు రూ. 30 వేలు, పత్తి పంటకు రూ. 50 వేలు దాకా రైతులు పెట్టుబడి పెట్టారని చెప్పారు. కౌలు రైతులు కౌలుతో సహా దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులు ఇంతలా నష్టపోతుంటే ప్రజాప్రతినిధులు గడపగడప కార్యక్రమంలో నిమగమయ్యా రని, ప్రభుత్వం తక్షణమే గడపగడప కాదు పొలం పొలం తిరిగి రైతులను పలకరించి వారి కష్టాలను తెలుసుకోవాలన్నారు. శ్రీశైలంలో 854 అడుగులు స్టోరేజ్‌లోనే నీటిని తీసుకోవచ్చని, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతకం ఎత్తిపోతల పథకం ద్వారా 828 అడుగుల స్టోరేజీ నుండి నీటిని తీసుకోవచ్చన్నారు. పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం, అధికారులు చోద్యం చూస్తున్నారని, తక్షణమే కెసి కెనాల్‌ కింద అరకొర ఉన్న పంటలకు నీటి విడుదల పెంచాలన్నారు. ఎండిపోయిన పంటలను అధికారులు నష్టపరిహారం అంచనాను (నివేదిక) సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతి పంటకు బీమాను అందించాలన్నారు. రబీ సాగుకు రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.రామేశ్వరరావు, జిల్లా నాయకులు వీరన్న, టి.వెంకటేశ్వరరావు, హనుమంతు, రైతులు సురేష్‌, రామ్మోహన్‌ రావు, బషీర్‌ అహ్మద్‌, నాగేశ్వరరావు, అహమ్మద్‌, కరీం, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.