ప్రజాశక్తి - నందవరం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మండల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకే పార్టీలోని నాయకుడు ఇన్ని రోజులు దూరంగా ఉండి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దగ్గర కావడంతో, పార్టీలోని మరో నాయకుడు పార్టీకి దూరం కానున్నారని సమాచారం అందడంతో టిడిపిలో గందరగోళం నెలకొంది.
నందవరం మేజర్ పంచాయతీ టిడిపికి కంచుకోటగా మారింది. 2014 ఎన్నికల్లో ప్రస్తుత టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాధవరావు దేశాయి, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు జె.నాగరాజు గౌడు టిడిపి గెలుపు కోసం కృషి చేశారు. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బీవీ.జయ నాగేశ్వర రెడ్డితో మనస్పర్థలు రావడంతో నాగరాజు గౌడ్, ఆయన భార్య జడ్‌పి వైస్ ఛైర్మన్ పుష్పవతి బీవీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో గడిచిన నాలుగేళ్లల్లో టిడిపిలో మాధవరావు దేశాయి ప్రముఖ పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగరాజు గౌడు బీవీ.జయ నాగేశ్వర రెడ్డి చెంతకు చేరడంతో మాధవ రావు దేశాయి బీవీకి దూరం కానున్నట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న తమను కాదని వేరే వారిని చెంతకు చేర్చుకుంటే కష్టపడిన తమకు గుర్తింపు ఏదని ఆయన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మాధవరావు దేశాయికి నందవరంలోనే కాకుండా వివిధ గ్రామాల్లో కూడా వ్యక్తిగత పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. వారంలో జరగబోయే లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొనకుండా నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుచరులు తెలుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీవీకే పట్టాం కడతారన్న సమయంలో పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడడంతో ఏమవుతుందోనని టిడిపి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తన అనుచరులతో బీవీని కలసిన నాగరాజు గౌడ్










